Anand Mahindra: నా కూతురి ఆపరేషన్ నేర్పిన గుణపాఠం ఇదే.. ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్య

Anand Mahindra talks about her daughters operation and the lesson it taught

  • కూతురి చేతివేలి ఆపరేషన్ ‌కోసం విదేశాలకు వెళ్లిన ఆనంద్ మహీంద్రా
  • ప్రపంచంలో టాప్ సర్జన్ ముంబైలోనే ఉన్నారని అక్కడి డాక్టర్ చెప్తే ఆశ్చర్యపోయానని వెల్లడి
  • చిన్న చిట్కాతో ముంబై డాక్టర్ తన కూతురు కోలుకునేలా చేశారన్న మహీంద్రా
  • అప్పటి నుంచీ భారతీయ టెక్నాలజీలపై అపారమైన నమ్మకం వచ్చిందని వెల్లడి

ఆసక్తికర, స్ఫూర్తివంతమైన విషయాలు పంచుకోవడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన 4వ అటల్ బిహారీ వాజ్‌పేయి మెమోరియల్ లెక్చర్‌లో ప్రసంగిస్తూ తన కూతురి ఆపరేషన్ గురించి, ఆ క్లిష్ట సమయం నేర్పిన గుణపాఠం గురించి చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగం వీడియోను ఆర్‌పీజీ గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష గోయెంకా నెట్టింట పంచుకున్నారు. 

ఏడాది వయసున్నప్పుడు తన కూతురి చేతివేలి ఆపరేషన్ ఎలాంటి మలుపులు తిరిగిందో ఆనంద్ మహీంద్రా కళ్లకు కట్టినట్టు వివరించారు. ‘‘ అది 1987.. అప్పట్లో ఏడాది వయసున్న నా చిన్న కూతురు నడవడం నేర్చుకుంటోంది. ఆ సమయంలో ఆమె ఓ చిన్న గాజు సీసా పట్టుకుని కిందపడటంతో చిన్న గాజు ముక్క ఆమె చేతివేలిలోని టెండాన్‌ను (కండను, ఎముకను కలిపే కణజాలం) తెంపింది. దీంతో టెన్షన్ పడిపోయిన నేను కొందరి సలహా మేరకు వెంటనే లండన్‌లోని ప్రముఖ మైక్రోసర్జరీ డాక్టర్‌ను సంప్రదించా. ఆపరేషన్ చేసిన ఆయన.. చిన్నారి కోలుకునేందుకు చేయి కదల్చలేని విధంగా చేయి చుట్టూ ఓ కాస్ట్ వేశారు. నెల రోజుల పాటు ఎంతో టెన్షన్‌గా వేచి చూశాక కాస్ట్ తీస్తే నా కూతురు చేతివేలు కదపలేకపోయింది. శస్త్రచికిత్స ఫెయిలైందని తెలిసి సర్జన్ కూడా షాకైపోయారు. ఆ తరువాత మరో సలహా మేరకు ప్యారిస్‌లోని మరో సర్జన్‌ డా.గ్లిషెస్టైన్‌ను సంప్రదించాము. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ మమ్మల్ని చూసి...మీరు డా. జోషీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. తెల్లమొహం వేసిన నేను ఆయన ఎవరని ప్రశ్శించాను. ప్రపంచంలో అత్యంత ప్రముఖ హ్యాండ్ సర్జన్‌లలో ఆయన ఒకరని డా. గ్లిషెస్టైన్ తెలిపారు. ఆయన భారతీయుడని, ముంబైలోనే ఉంటారని చెప్పారు. తమకంటే ఆయనకే ఎక్కువ అనుభవం ఉందని అన్నారు. భారత్‌లో అనేక మందికి చేతిగాయాలు అవుతుండటంతో వారికి చికిత్స చేసే క్రమంలో అపార అనుభవం గడించారని అన్నారు’’

‘‘డా. జోషి అడ్రస్ కూడా ఇచ్చారు. ఆయన ఆఫీసు మా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. వెంటనే ఇండియాకు వచ్చి ఆయనను కలిశాము. ఆ మరుసటి రోజే డా. జోషి నా కూతురికి మళ్లీ ఆపరేషన్ చేశారు. ఈ తరహా కేసుల్లో ఆపరేషన్ కంటే పేషెంట్ ఎలా కోలుకుంటారనేదే కీలకమని డా.జోషి వివరించారు. గాయాన్ని మాన్పే క్రమంలో వేలిలో ఏర్పడే కొత్తకండరం వేలి కదలికలకు అడ్డంకిగా మారుతుందని వివరించారు. దీన్ని నివారించేందుకు డా.జోషి చూపించిన సులువైన పరిష్కారం నా మతి పోగొట్టింది. ఆయన.. చిన్నారి చేతివేలికి ఓ చిన్న హుక్ (బ్లౌస్ హుక్‌ లాంటిది) జతచేశారు. ఆ తరువాత మణికట్టు వద్ద మరో బ్యాండేజ్ చుట్టి దానికి మరో హుక్ తగిలించారు. ఈ రెండింటినీ ఓ రబ్బర్ బ్యాండ్‌తో జతచేశారు. ఈ పరికరం ఖర్చు జస్ట్ రూ.2. ఇది వేలికదలికలకు అవకాశం ఇస్తూనే గాయం పూర్తిస్థాయిలో నయమయ్యేలా చేసింది. మరో పదేళ్ల తరువాత నా కూతురు పియానో కూడా వాయించింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

‘‘ఈ ఉదంతం గురించి నేను చాలా సార్లు చెప్పాను. మన సమస్యలకు పరిష్కారాలు సాధారణంగా మనకు సమీపంలోనే ఉంటాయని, ప్రతిసారీ విదేశాలవైపు చూడనక్కర్లేదన్న గుణపాఠం నేర్చుకున్నాను. ఇది నా కెరీర్‌ను మార్చేసింది. భారతీయ టెక్నాలజీని ఆ తరువాత మరెప్పుడూ సందేహించలేదు. భారతీయ టెక్నాలజీపై నమ్మకంతోనే భారీ పెట్టుబడులు పెట్టా.. రిస్క్ తీసుకున్నా. 1990ల్లో స్కార్పియో కారు విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నా. నేటి విజయానికి అదే మూలం’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Anand Mahindra
Viral Videos
Indigenous Technology
  • Loading...

More Telugu News