Vangaveeti Narendra: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధా సోదరుడు
  • సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక 
  • వంగవీటి నరేంద్రకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్
Vangaveeti Narendra joins YSRCP

వంగవీటి రాధా రాజకీయ భవితవ్యంపై రోజుకో వార్త వస్తున్న నేపథ్యంలో, ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, తాను బీజేపీ నుంచి బయటికి వచ్చేశానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ రెండు కుటుంబాలది నాలుగు దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. 

ఇక, వంగవీటి రంగాను టీడీపీనే చంపిందని, టీడీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని రంగా నిందితులను తప్పించిందని ఆరోపించారు. వంగవీటి రంగాను అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ అలాంటి పార్టీతో ఎలా కలుస్తాడని నరేంద్ర ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుని బీజేపీ తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. 

తన సోదరుడు వంగవీటి రాధా గతంలో వైసీపీ నుంచి బయటికి వచ్చేసి తప్పు చేశాడని నరేంద్ర విచారం వ్యక్తం చేశారు. టీడీపీ ఓ వర్గం కోసమే పనిచేసే పార్టీ అని, సొంత లాభం తప్ప ఆ పార్టీ ఇంకేమీ పట్టించుకోదని అన్నారు. 

పేదల కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని, ఈ ఐదేళ్లలో జగన్ అందించిన సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. ఏపీ ప్రజలు మరోసారి జగన్ నాయకత్వాన్నే బలపరుస్తారని తెలిపారు.

More Telugu News