Ponnam Prabhakar: తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిస్తున్నారని సీఎస్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు

  • తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఇతరులకు పంపిస్తున్న సదరు ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్
  • కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారన్న మంత్రి
Minister Ponnam Prabhakar complaint against rdo about phone tapping

తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిస్తున్నారంటూ హన్మకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఇతరులకు పంపిస్తున్న సదరు ఆర్డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరవు వచ్చిందని బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్ సభ స్థానాల్లో టఫ్ నడుస్తోందన్నారు. బండి సంజయ్‌‌ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడని తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తోందని.. దానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు.

కిషన్ రెడ్డి‌ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారని ఆరోపించారు. ఆ విషయం కూడా బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారని విమర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు ఇద్దరూ లోపాయకారీగా మిత్రులని తీవ్ర ఆరోపణలు చేశారు.

More Telugu News