tejaswi surya: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఇలా దాడులు ఎందుకు జరుగుతాయి?: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నిలదీత

  • బెంగళూరులో మొబైల్ దుకాణ యజమాని ముఖేశ్‌ను కొట్టిన దుండగులు
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ నిందితుల వైపు నిలిచిందని ఆగ్రహం
  • కర్ణాటకలో వరుసగా ఘటనలు జరుగుతున్నాయని తేజస్వి సూర్య విమర్శ
BJP leader Tejasvi Surya slams Congress govt

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాడులు జరుగుతాయని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. ఇటీవల బెంగళూరులో సిద్దన్న లేఔట్‌లో ముఖేశ్ అనే మొబైల్ షాప్ యజమాని తన దుకాణంలో హనుమాన్ చాలీసా పెట్టినందుకు కొందరు దుండగులు వచ్చి ఆయనపై దాడి చేశారు. ఈ దాడి ఘటనను తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఓటు బ్యాంకు రాజకీయాలు ఇందుకు కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధితుడికి న్యాయం చేయకుండా, నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ ఘటనతో రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని మేం పోలీసులను కోరుతున్నామని తెలిపారు. ఇందులో రాజకీయం ఏముంది? అని నిలదీశారు. దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ అంత స్పష్టంగా ఉన్నప్పటికీ నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, మంత్రులు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదని విమర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు బయట తిరుగుతుంటే.. దాడికి గురైన వ్యక్తిని అరెస్ట్‌ చేయడం దురదృష్టకరమన్నారు.

'బ్రాండ్ బెంగళూరును నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది... కానీ ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని తాను ఒకటే అడుగుతున్నాను... ఇక్కడ ఇలా శాంతిభద్రతల సమస్య ఉంటే దేశంలో మీరు బ్రాండ్ బెంగళూరును ఎలా నిర్మిస్తారు?' అని ఆయన ప్రశ్నించారు. ఓ వర్గంపై ఇలాంటి దాడులు జరుగుతుంటే.. వారు ప్రశాంతంగా తమ పనులను ఎలా చేసుకోగలుగుతారో చెప్పాలన్నారు. నగరంలో రెండు వారాల క్రితం బాంబు పేలుడు జరిగిందని... దానికి ఓ వారం ముందు పాకిస్థాన్ జిందాబాద్‌ అనే నినాదాలు చేశారని, ఇప్పుడు మొబైల్ దుకాణంలో వ్యక్తిపై దాడి జరిగిందని... వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? అల్లర్లను సృష్టించేవాళ్లు, అశాంతిని రేకెత్తించే వాళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు రెచ్చిపోతారు? దినేశ్ గుండూరావు లాంటి  మంత్రులు నిందితులకు అండగా ఉన్నారే తప్ప.. బాధితుడి పక్షాన ఎందుకు నిలబడలేదు? అని మండిపడ్డారు. కాగా, తేజస్వి సూర్య నిన్న బాధితుడు ముఖేశ్‌ను పరామర్శించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాఫ్తు జరపాలని బెంగళూరు కమిషనర్‌ను డిమాండ్ చేశారు.

More Telugu News