Nara Lokesh: అవకాశమివ్వండి... మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తా!: నారా లోకేశ్

  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
  • వరుసగా తటస్థ ప్రముఖులతో భేటీలు
  • ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి
  • నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టీకరణ
Nara Lokesh appeals Mangalagiri voters to give a chance

మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేశ్ నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 

లోకేశ్ తొలుత మంగళగిరి 8వ వార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లారు. అక్కడ లోకేశ్ కు వెంకన్న కుటుంబసభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. వెంకన్న ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సంచాలక్ సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతోపాటు పద్మశాలి సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్న ఈ సందర్భంగా లోకేశ్ ఎదుట ప్రస్తావించారు. 

యువగళం పాదయాత్ర సందర్భంగా తాను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశానని, అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని లోకేశ్ చెప్పారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇది విజయవంతమైతే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2 నెలల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ రద్దుచేయాలని నిర్ణయించామని తెలిపారు.

తర్వాత నవులూరు వెళ్లి యాదవ సామాజిక వర్గ ప్రముఖుడు, రైస్ మిల్లర్, ఇటుకల వ్యాపారి బత్తుల శ్రీనివాసరావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తాము నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ దృష్టికి తెచ్చారు. 

గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఏ వ్యాపారవర్గం ప్రశాంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయిందని లోకేశ్ బదులిచ్చారు. ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో యాదవ సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీసీలకు అన్నివిధాలా అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీయేనని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్విదించాలని లోకేశ్ కోరారు. 

చివరగా మంగళగిరి రూరల్ యర్రబాలెం వెళ్లి ముస్లిం సామాజిక వర్గ ప్రముఖుడు, ఆటోమొబైల్ వ్యాపారి సయ్యద్ బాజీ షేక్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాజీ షేక్ మాట్లాడుతూ... అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల తమ గ్రామంలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా మారారని తెలిపారు. యర్రబాలెంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించారు. అందుకు లోకేశ్ స్పందించారు. 

టీడీపీ హయాంలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. రంజాన్ తోఫా, పెళ్లి కానుక, ఇమామ్, మౌజామ్ లకు గౌరవ వేతనం, షాదీఖానాల నిర్మాణం, రంజాన్ వస్తే మసీదులకు మరమ్మతులు, రంగులు వేయడానికి నిధులు కేటాయించామని తెలిపారు. కానీ జగన్ ప్రభుత్వం మైనార్టీలకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిందని ఆరోపించారు. 

వైసీపీ నేతల దాడులు, వేధింపులు కారణంగా అబ్దుల్ సలామ్, మిస్బా, ఇబ్రహీం లాంటి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమరావతి నిర్మాణ పనులను జెట్ స్పీడుతో పరుగులు తీయిస్తారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక యర్రబాలెంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

More Telugu News