Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి ఇచ్చాడంటే..!

  • డొనేషన్లలో టాపర్ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ సీఈవో శాంటియాగో మార్టిన్
  • తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు రూ.509 కోట్ల విరాళం
  • అన్ని పార్టీలకూ ఇచ్చిన మొత్తం రూ.1,368 కోట్లు
Biggest Electoral Bonds Purchaser Is Top Donor For This Party

రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పథకం ద్వారా అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి శాంటియాగో మార్టిన్ అని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. తాజాగా ఈసీ వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ సీఈవో అయిన మార్టిన్ మొత్తంగా అన్ని పార్టీలకు కలిపి రూ.1,368 కోట్లు విరాళంగా అందించాడు. ఇందులో పెద్ద మొత్తం రూ.509 కోట్లు ఒక్క డీఎంకే పార్టీకే ఇచ్చాడని ఈసీ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ.656.5 కోట్ల విరాళం అందుకున్నట్లు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే వెల్లడించింది. ఇందులో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రూ.509 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్ టీవీ రూ.10 కోట్లు కాగా మిగతా విరాళాలు పలువురు దాతల నుంచి స్వీకరించినట్లు తెలిపింది.

ఎవరీ శాంటియాగో మార్టిన్..
ఫ్యూచర్ గేమింగ్ కంపెనీతో పాటు హోటల్ రంగంలో పేరొందిన వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్.. ఆయనను 'లాటరీ కింగ్' అని వ్యవహరిస్తారు. వలస కూలీలుగా మయన్మార్ వెళ్లిన భారతీయ కుటుంబంలో మార్టిన్ జన్మించాడు. చిన్నతనంలో కూలీగా పనిచేసిన మార్టిన్.. టీనేజ్ లో లాటరీలు అమ్మేవాడు. 1980లలో కుటుంబం సహా భారత్ కు తిరిగి వచ్చి కోయంబత్తూర్ లో స్థిరపడ్డాడు. అక్కడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం గేమింగ్, హోటల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయన వ్యాపారం చేస్తున్నాడు. లాటరీ వ్యాపారంతో మొదలు పెట్టి ఒక్కో రంగానికి తన బిజినెస్ ను విస్తరించాడు.

పొరుగు దేశాలు భూటాన్, నేపాల్ లోనూ మార్టిన్ లాటరీ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన వ్యాపార సంస్థలపై పలుమార్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేశారు. పలు ఆస్తులను సీజ్ చేశారు. వీటిపై మార్టిన్ కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడు. ఈడీ సీజ్ చేసిన ఆస్తులను విడిపించుకోవడానికి గతేడాది ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను మార్టిన్ తోసిపుచ్చాడు. భారతీయ చట్టాలకు లోబడే తాను వ్యాపారం చేస్తున్నానని, 2023లో దేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచానని ఇటీవల వెల్లడించాడు.

More Telugu News