Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: విశాఖ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

  • రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామన్న తెలంగాణ సీఎం
  • చంద్రబాబు, జగన్ ఎవరు గెలిచినా మోదీ వైపే ఉంటారని విమర్శ
  • చంద్రబాబు, జగన్ చెరో అయిదేళ్ళు ఉన్నా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న
Revanth Reddy allegations on chandrababu naidu in vishaka meeting

విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో జరిగిన 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో జగన్, చంద్రబాబు ఎవరు గెలిచినా మోదీ వైపే ఉంటారని విమర్శించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని కొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు ఏపీకి కావాల్సింది పాలకులు కాదని... ఢిల్లీలో ప్రశ్నించే గొంతు అన్నారు. మనం తెలుగువాళ్లం.. మనమంతా అన్నదమ్ములం... రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందామన్నారు.

ఏపీలో పదేళ్ళుగా ప్రశ్నించే గొంతుకలు లేవన్నారు. ఢిల్లీలో ఉన్న మోదీ ఇక్కడి వారి ద్వారా ఏపీని శాసించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. జగన్, చంద్రబాబు ఏపీ ప్రయోజనాల కోసం ఈ పదేళ్లలో ఎప్పుడూ కొట్లాడలేదని విమర్శించారు. ఢిల్లీని అడిగి.. ప్రశ్నించి ఏపీకి లాభం చేసే నాయకులు లేకుండా పోయారన్నారు. ఏపీలో మళ్లీ వారిద్దరిలో ఎవరు గెలిచినా మోదీ దగ్గరకే వెళతారని గుర్తించాలన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మోదీని ఎదిరించి నిలిచే శక్తి ఉందా? అని ప్రశ్నించారు.

కానీ షర్మిల మీకు అండగా నిలబడుతుందని... మీ కష్టాలలో తోడుగా ఉండాలని ఇక్కడకు వచ్చిందని చెప్పారు. అందుకే ఆమెను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, జగన్ ఢిల్లీలో మోదీని ప్రశ్నిస్తారా? అని నిలదీశారు. అసలు ఏపీకి ఏమైనా తీసుకు వస్తారా? అన్నారు. అదే జరిగితే చంద్రబాబు అయిదేళ్లు, జగన్ మరో అయిదేళ్లు ఉంటే కనీసం పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? అని ప్రశ్నించారు.

More Telugu News