Revanth Reddy: ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ పక్కన మీ బట్టలు కూడా ఉండవ్: రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే నేను సిద్ధం... మీరు నిద్రలేచే లోపు మీ పక్కన ఎవరూ ఉండరని వార్నింగ్
  • నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చునని సూచన
  • పడగొట్టేది ఉంటే చెప్పండి... అప్పుడు పరిణామాలు ఏమిటో నేను చెబుతానని హెచ్చరిక
Revanth Reddy warning to brs and bjp leaders

తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎవరైనా ఆలోచన చేస్తే... వారు నిద్రలేచే లోగా వారి పక్కన ఎవరూ ఉండరు... లేచి చూస్తే మీరు తొడుక్కునే బట్టలు కూడా ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

'ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే పోటీని వారు పెట్టారనుకుంటే... దేనికైనా నేను సిద్ధం... కానీ మొదట వారు ఏం కావాలో కోరుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితో నేను పరిపాలన సాగిస్తున్నాను. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు. నాకేదో కాళ్లలో కట్టె పెట్టాలి... ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే... స్పష్టంగా చెబుతున్నాను... పడగొట్టాలనే ఆలోచన మీరు చేస్తే మీరు నిద్రలేచే లోగా మీ పక్కన ఎవరూ ఉండరు. లేచి చూస్తే మీరు తొడుక్కునే బట్టలు కూడా ఉండవు. ఎమ్మెల్యేల సంగతి చాలా దూరం. ఒకవేళ వారు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు తారీఖు చెప్పండి... పడగొట్టేది ఏమిటో చెప్పండి... అప్పుడు పరిణామాలు ఏమిటో నేను చెబుతాను. కానీ ఇలాంటి వ్యవహారం చేస్తే మాత్రం (ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన) దానికి తగిన ప్రణాళిక మా వద్ద సిద్ధంగా ఉంది. ఈ మంచి ప్రభుత్వం పడిపోతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. 2023 నుంచి 2033 వరకు మేం అధికారంలో ఉంటామ'ని రేవంత్ రెడ్డివ్యాఖ్యానించారు.

టీఎస్ అనేది టీఆర్ఎస్‌కు నకలు వంటిదని... ప్రస్తుతం దానిని టీజీగా మార్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక ఒక్క తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు. మా మంత్రులు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని ప్రశంసించారు. కష్టపడి పని చేస్తోన్న మంత్రులను అభినందిస్తున్నానన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలా బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్నారు.

More Telugu News