T20 World Cup 2024: ఈసారి భార‌త్‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే.. జ‌ట్టులో కచ్చితంగా కోహ్లీ ఉండాలి: కృష్ణమాచారి శ్రీకాంత్‌

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2024లో కోహ్లీపై వేటు వేసే యోచ‌న‌లో బీసీసీఐ ఉందంటూ వదంతులు
  • ఈ పుకార్ల‌పై ఘాటుగా స్పందించిన‌  కృష్ణమాచారి శ్రీకాంత్ 
  • కోహ్లీ లేకుండా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమా? ఛాన్సే లేదన్న శ్రీకాంత్  
Virat Kohli a must for T20 World Cup 2024 says Krishnamachari Srikkanth

ర‌న్ మెషిన్ విరాట్ కోహ్లీని ఈ ఏడాది జూన్‌లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బీసీసీఐ ప‌క్క‌న పెట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వ‌స్తున్న వ‌దంతుల‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ఈ పుకార్ల‌పై ఆయ‌న మండిప‌డ్డాడు. ఈసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టీమిండియా స్క్వాడ్‌లో త‌ప్ప‌కుండా విరాట్ కోహ్లీ ఉండాల‌ని అన్నాడు. అస‌లు కోహ్లీ లేని వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టును ఊహించ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. 

ఇదిలాఉంటే.. 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ కోహ్లీని త‌ప్పించి, అత‌డి స్థానంలో యువ ఆట‌గాళ్లకు అవ‌కాశం క‌ల్పించాల‌ని బీసీసీఐ యోచిస్తున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. విండీస్‌లోని స్లో పిచ్‌ల‌కు విరాట్ బ్యాటింగ్ స్టైల్ స‌రిపోద‌ని, టీ20ల‌లో కోహ్లీ ఇంత‌కుముందు మాదిరి ఇప్పుడు దూకుడుగా ఆడ‌లేడ‌ని.. అందుకే అత‌డిని త‌ప్పించాల‌ని బోర్డు వ‌ర్గాల ఆలోచ‌న‌ అనేది ఆ వార్త‌ల సారాంశం. 

ఈ వ‌దంతుల‌పై శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. "కోహ్లీ లేకుండా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమా? ఛాన్సే లేదు. 2022లో జ‌ట్టును ఒంటి చేతితో సెమీ ఫైన‌ల్‌కు చేర్చాడు. ఆ ఎడిష‌న్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ కూడా అత‌డే. అలాంటి వ్య‌క్తికి జ‌ట్టులో చోటు ఉండ‌దా? అస‌లు ఈ రూమ‌ర్లు పుట్టిస్తున్న‌ది ఎవ‌రు? వాళ్ల‌కు ప‌నులేమీ లేవా? నిరాధార‌మైన వ్యాఖ్య‌ల‌తో ఎందుకు గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారు? ఒక‌వేళ ఈసారి టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాలంటే విరాట్ కోహ్లీ క‌చ్చితంగా జ‌ట్టులో ఉండి తీరాల్సిందే" అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. 

ఈ సంద‌ర్భంగా భార‌త జ‌ట్టుకు శ్రీకాంత్ చిన్న స‌లహా కూడా ఇచ్చాడు. 2011లో ఎలాగైతే  వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి లిటిల్ మాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు టీమిండియా స‌భ్యులు మ‌రిచిపోలేని జ్ఞాప‌కంగా మార్చారో.. ఈ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి విరాట్ కోహ్లీకి కూడా అలాగే ఘ‌నంగా వీడ్కోలు ఇస్తే బాగుంటుంద‌ని తెలిపాడు. ఈ గౌర‌వానికి కోహ్లీ అన్ని విధాల అర్హుడ‌ని శ్రీకాంత్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

More Telugu News