RS Praveen Kumar: నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…?: ప్రవీణ్ కుమార్

  • కవిత అరెస్ట్ ఒక భూటకమన్న ప్రవీణ్ కుమార్
  • నాజీల పాలన కన్నా మోదీ పాలన ఘోరంగా ఉందని విమర్శ
  • అక్రమ అరెస్ట్ లతో బెదిరేది లేదని వ్యాఖ్య
RS Praveen Kumar on Kavitha arrest

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీని అడ్డంపెట్టుకుని మోదీ ప్రభుత్వం చేసిన అరెస్ట్ ఒక బూటకమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ అరెస్ట్ ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. బీజేపీ కుటిల ఎత్తులకు తలొగ్గకుండా, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీఎస్సీతో కేసీఆర్ చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. ఇది అప్రజాస్వామికమని చెప్పారు. కవిత అరెస్ట్ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదని అన్నారు. 

ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో బెదిరేది లేదని చెప్పారు. బెదిరింపులకు బెదిరితే తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. కవిత అరెస్ట్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంలో భాగమేనని చెప్పారు. నాటి నాజీల నియంతృత్వ పాలన కన్నా మోదీ పాలన ఘోరంగా ఉందని అన్నారు. మొన్న సాయిబాబా, సిసోడియా, నిన్న హేమంత్ సొరేన్, ఈరోజు కవిత, రేపు నువ్వో నేనో? అని ప్రవీణ్ కుమార్ అన్నారు. అందుకే తెలంగాణ సమాజం, యావత్ దేశం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

More Telugu News