K Kavitha: కవిత స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఈడీ... ఆమె న్యాయవాదిని లోపలికి అనుమతించని అధికారులు

  • కవిత ఇంటికి వచ్చిన 12 మంది ఈడీ అధికారులు
  • ఇద్దరు మహిళా అధికారుల సమక్షంలో స్టేట్‌మెంట్ రికార్డ్
  • కవిత పిటిషన్‌పై 19న సుప్రీంకోర్టులో విచారణ ఉందన్న న్యాయవాది 
  • ప్రస్తుత పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదని వెల్లడి
ED records kavitha statement

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. కవిత నివాసానికి మొత్తం 12 మంది ఈడీ అధికారులు వచ్చారు. ఇందులో ఢిల్లీ నుంచి ఏడుగురు అధికారులు వచ్చారు. ఇందులో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఈ మహిళా అధికారుల సమక్షంలో కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. మద్యం కేసుకు సంబంధించి ఆమె వద్ద ఉన్న డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 12 మంది ఈడీ ఆధికారుల్లో ఐదుగురు కవిత నివాసంలోకి వెళ్లగా... మిగతా అధికారులు మాత్రం ఇంటి బయట ఉండిపోయారు. 

కవిత నివాసంలోకి న్యాయవాదిని అనుమతించని అధికారులు

ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. బయట ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం కవిత కేసు సుప్రీంకోర్టులో ఉందని, ఈ నెల 19న కేసు విచారణ ఉందని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండవని సుప్రీంకోర్టుకు కూడా ఈడీ చెప్పిందని వెల్లడించారు. కవితను కలవడానికి వెళితే లోపలికి అనుమతించలేదన్నారు.

కేసు పెండింగ్‌లో ఉన్నందున అధికారులు ఎందుకు వచ్చారో తెలియాల్సి ఉందన్నారు. తీర్పు వచ్చే వరకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండవని ఈడీ స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలిపారు. ఈడీ అధికారులు బయటకు వచ్చాక గానీ ఏమీ చెప్పలేమన్నారు. ఈడీ అధికారులు లోపల సెర్చ్ చేస్తున్నారని ఎలా చెప్పగలమని.. వారిని కలిసిన తర్వాత తాను అన్ని వివరాలు చెబుతానన్నారు.

More Telugu News