Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలలోకి వెళుతున్నారు... ఇక మిగిలేది నలుగురే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • తాము ఆహ్వానిస్తే నల్గొండ జెడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ పార్టీ నుంచి రోజుకో నాయకుడు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళుతున్నారన్న మంత్రి
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడి
Minister Komatireddy says only four leaders will remain in brs

బీఆర్ఎస్ నాయకులు వరుసగా ఇతర పార్టీలలోకి వెళుతున్నారని... ఆ పార్టీలో చివరకు మిగిలేది నలుగురు మాత్రమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాము ఆహ్వానిస్తే నల్గొండ జెడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి రోజుకో నాయకుడు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళుతున్నారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేసీఆర్ దిగిపోతే పీడ విరగడయిందని ప్రజలు అనుకున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం బంగారం అయిందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తన కొడుకు ప్రతీక్ పేరిట లైబ్రరీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కో మహిళా సంఘానికి రూ.1 కోటి ఇస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని... దీనిని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

కోమటిరెడ్డి సోదరులకు మంచి పేరు వస్తుందని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను ఆపేశారని ఆరోపించారు. వానాకాలం లోపు బ్రాహ్మణవెల్లంల కాలువలు తీయించి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లంలను మోడల్ విలేజ్‌గా మార్చి సోలార్ విలేజ్‌గా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామానికి చెందిన 200 మంది పేదలకు తన సొంత స్థలం మూడెకరాల్లో ఇళ్లు కట్టిస్తానన్నారు. బ్రాహ్మణ వెల్లంలలో త్వరలో కెనరా బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. తన ఊరు బ్రాహ్మణవెల్లంల ప్రజలే తన బలం... తన బలగం అన్నారు. కాగా కోమటిరెడ్డి మంత్రి అయ్యాక తొలిసారి తన గ్రామంలో పర్యటించారు.

More Telugu News