Praneeth Rao: రేవంత్‌రెడ్డి ఎవరిని, ఎక్కడ కలుస్తున్నారు?.. బీఆర్ఎస్ నేత ఆదేశాలతో ప్రత్యేక దృష్టిసారించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

  • ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను చెరిపేసిన ప్రణీత్‌రావు
  • బీఆర్ఎస్ ఓడిన వెంటనే హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం
  • వంద ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమన్న బీఆర్ఎస్ నేత
  • రేవంత్‌రెడ్డి సోదరులు, ఆయన సన్నిహితుల నంబర్లు కూడా ట్యాపింగ్
  • సేకరించిన సమాచారం ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతకు అందజేత
  • ఎన్టీవీ చేతికి ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు
Senstational things revealed in Praneeth Rao remand report

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతి రోజున అంటే డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్‌డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్‌డిస్క్‌ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అరెస్ట్ సందర్భంగా ప్రణీత్‌రావు నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్టు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్‌ కూడా ప్రణీత్‌కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేసి దానిని తన పర్సనల్ పెన్ డ్రైవ్‌లోకి కాపీచేసుకునే వాడని తేలింది. ఆయనతోపాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తేలింది.

రేవంత్‌‌రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు?
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు తమకు చిక్కినట్టు పేర్కొన్న ఎన్టీవీ.. మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్‌ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన వంద నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు? అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది. రేవంత్‌రెడ్డిని ఎవరు? ఎక్కడ కలుస్తున్నారు? అన్న సమాచారాన్ని ప్రణీత్‌రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది.

మీడియా పెద్దల ఫోన్ నంబర్లు కూడా
రేవంత్‌రెడ్డి అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్‌రెడ్డి సోదరుల ఫోన్ నంబర్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు మీడియా పెద్దల ఫోన్లను సైతం ఆయన ట్యాప్ చేసిన విషయం చాటింగ్ ద్వారా బయటపడిందని, దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని ఎన్టీవీ ఆ కథనంలో పేర్కొంది.

More Telugu News