Mamata Banerjee: మమతా బెనర్జీని ఎవరైనా వెనుక నుంచి తోసేసి ఉండొచ్చు.. తీవ్ర గాయంపై వైద్యుల అనుమానం

  • నెట్టివేయడం కారణంగా తీవ్ర గాయం అయ్యుండొచ్చని ఎస్ఎస్‌కేఎం హాస్పిటల్ వైద్యుల సందేహం
  • చికిత్స అనంతరం హాస్పిటల్‌ నుంచి తన నివాసానికి వెళ్లిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
  • మరిన్ని వైద్య పరీక్షల కోసం నేడు మరోసారి హాస్పిటల్‌కు వెళ్లనున్న పశ్చిమ బెంగాల్ సీఎం
Mamata Banerjee fell probably because of a push from behind says SSKM Director

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుదుటిపై తీవ్ర గాయమవ్వడంపై వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరైనా వెనుక నుంచి తోసేసి ఉంటారని చికిత్స అందించిన కోలకతాలోని ఎస్ఎస్‌‌కేఎం మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డైరక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ సందేహం వ్యక్తం చేశారు. నెట్టివేయడం కారణంగానే తీవ్రమైన గాయం అయి ఉండొచ్చని అన్నారు. సీఎంను రాత్రి 7.30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకొచ్చారని, బహుశా వెనుక నుంచి తోసేయడంతోనే ఆమె కింద పడిపోయి ఉండొచ్చు అని ఆయన అన్నారు. తీవ్రమైన రక్తస్రావం జరిగిందని వివరించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

న్యూరోసర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణులు చికిత్స అందించారని మణిమోయ్ బందోపాధ్యాయ వివరించారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, సీటీ స్కాన్ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పినప్పటికీ ఇంటికి వెళ్లాలంటూ ఆమె పట్టుబట్టారని వివరించారు. కాగా మరిన్ని వైద్య పరీక్షల కోసం సీఎం మమతాబెనర్జీ శుక్రవారం మరోసారి ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని అన్నారు. కాగా ప్రస్తుతం ఆమె తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు.

కాగా సీఎం మమతాబెనర్జీ గురువారం రాత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో కాలుజారి పడడంతో నుదుటిపై తీవ్రమైన గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తృణమూల్‌ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ షేర్ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News