Pawan Kalyan: ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరూ అమలు చేయనివ్వలేదు: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం
  • ఈ సందర్భంగా పవన్ భావోద్వేగ పూరిత ప్రసంగం
  • పార్టీ నిర్వహణలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించిన జనసేన అధినేత
  • ఒకానొక దశలో డబ్బులు లేక, పార్టీ ఎలా నడపాలో తెలియక ఇబ్బంది పడ్డానని వెల్లడి
  • క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మిత్రుడు త్రివిక్రమ్‌కు థ్యాంక్స్ చెప్పిన పవన్
pawan kalyan about his struggles in politics

తన రాజకీయ ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన ఆఫీసులో ఓ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడం డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని తెలిపారు. పార్టీ నిర్వహణలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన తనకు అండగా నిలిచారన్నారు. 

‘‘దాదాపు 10 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ సీట్లు ఉండుంటే ఈ పాటికి గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీ అయ్యేది. ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరూ అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే లక్షలాది మంది జనం వచ్చేస్తారు. లక్షలాది ఓటర్లు కాదు. నాకు ఆ స్పష్టత ఉంది. దారుణం ఏంటంటే, 2019లో ఎన్నికల్లో ఓడిపోతానన్న విషయం కూడా నాకు తెలుసు. యుద్ధం చేసినప్పుడు జయాపజయాలతో సంబంధం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, సినిమాలన్నీ వదులుకుని, డబ్బుల్లేక, ఇంత అభిమాన బలం ఉండి, ఓడిపోయిన తర్వాత, దేశం మీద ఇంత పిచ్చి మంచిదా? అని అనుకున్నా. 

‘‘పార్టీని ఎలా నడపాలో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాలేదు. అలాంటి సమయంలో వెన్నంటే ఉన్న నా స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవారు ఒకరు ఉండాలి కదా. ‘వకీల్‌సాబ్‌’తో పాటు మరో మూడు, నాలుగు సినిమాలు చేశాం. నేను రాజకీయాల్లోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. టీనేజ్‌లో ఉద్యమంలోకి వెళ్లిపోవాలనుకున్నా కానీ కుదరలేదు. సమాజంపై మనసులో ఎంతో కోపం ఉండిపోయింది. నా వ్యధ చూసి ఆయన ఆ బాధనంతా సినిమాలో మాటలుగా రాసేస్తే రాజకీయాల్లోకి వెళ్లనని భావించి ‘జల్సా’లో ఇంటర్వెల్ సీన్ రాశారు. నా ఆవేశం చూసి, చివరకు ఆయన చేతులెత్తేశారు. మీ ఇష్టం వచ్చింది చేయండన్నారు’’ అని పవన్ చెప్పుకొచ్చారు.

More Telugu News