Eagle squad: తెలంగాణ పోలీసులకు సరికొత్త ‘ఆయుధాలు’.. వీడియో ఇదిగో!

  • డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు ఈగల్ స్క్వాడ్
  • రెండు గద్దలను సమకూర్చుకున్న పోలీసులు
  • గాల్లో ఎగురుతున్న డ్రోన్లను కూల్చేసేలా వాటికి శిక్షణ
  • నెదర్లాండ్స్ తర్వాత మళ్లీ తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్
In Telangana an eagle squad to pull down rogue drones

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు గద్దలను తమ టీమ్ లో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అలాకర్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం మొయినాబాద్ లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు.

ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద.. డ్రోన్ ను కాలితో పట్టుకుని నేల మీదికి తీసుకువచ్చింది. కాగా, ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు మూడేళ్లుగా శిక్షణ ఇస్తోందని చెప్పుకొచ్చారు. 

ఈ గద్దలను ఎక్కడ ఉపయోగిస్తారంటే..
వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను వాడాలని నిర్ణయించినట్లు డీజీపీ రవి గుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈ ఈగల్ స్క్వాడ్ ను పర్యవేక్షిస్తుందని వివరించారు. 2020 జులైలో ఈగల్ స్క్వాడ్‌తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

More Telugu News