BJP: బీజేపీ నుంచి రెండు జాబితాలు.. 21 శాతం ఎంపీలను పక్కన పెట్టేసిన కాషాయ పార్టీ

  • ప్రభుత్వ వ్యతిరేకత నుంచి తప్పించుకునే ఎత్తుగడ
  • చాలా రాష్ట్రాల్లో కొత్తవారికి చోటు
  • ఈసారి 370 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ
In 2 Lok Sabha Lists BJP Has Already Dropped 21 Percent Of Its MPs

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకు రెండు జాబితాల్లో 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే, ఈసారి పాతవారిలో చాలామందిని పక్కనపెట్టేసి కొత్త ముఖాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో 21 శాతం మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసింది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో విజయం సాధించిన స్థానాల కంటే 67 స్థానాలు అధికంగా అంటే 370 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రకటించిన 267 స్థానాల్లో 140 మంది సిట్టింగులకు మాత్రమే మళ్లీ అవకాశం కల్పించింది. 67 మందికి టికెట్ నిరాకరించింది. ఈస్ట్ ఢిల్లీ నుంచి గతంలో గెలిచిన ఎంపీ గౌతం గంభీర్‌కు ఈసారికి టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో హర్ష్ మల్హోత్రాకు సీటు ఇచ్చింది. 

డిల్లీలో మొత్తం ఆరు స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించగా, మనోజ్ తివారీకి మాత్రమే తిరిగి టికెట్ ఇచ్చింది. రెండో జాబితాలో కర్ణాటక నుంచి 20 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో 8 మంది మాత్రమే సిట్టింగ్ ఎంపీలు కాగా, 11 మంది కొత్తవారికి చాన్స్ ఇచ్చింది. ఇలా మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్రలోనూ కొత్త ముఖాలకు చోటిచ్చింది.

More Telugu News