WPL 2024: డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్‌కు ఢిల్లీ.. ఎలిమినేటర్‌లో తలపడేది ఎవ‌రంటే..!

  • ముగిసిన డ‌బ్ల్యూపీఎల్ లీగ్ ద‌శ మ్యాచులు
  • పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన‌ ఢిల్లీ నేరుగా ఫైన‌ల్‌కు
  • ఎలిమినేటర్‌లో తలపడనున్న ముంబై, బెంగ‌ళూరు
  • గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌లో ఢిల్లీతో ఢీ
Delhi Capitals in Womens Premier League 2024 Final

ఉమెన్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. బుధ‌వారంతో లీగ్ ద‌శ మ్యాచులు ముగిశాయి. లీగ్ ద‌శ చివ‌రి మ్యాచులో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో గుజ‌రాత్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్‌పై ఢిల్లీ ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఆ త‌ర్వాత 127 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం 13.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గుజ‌రాత్‌ను ఓడించింది. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ష‌ఫాలీ వ‌ర్మ సంచ‌ల‌న బ్యాటింగ్‌తో అల‌రించింది. కేవ‌లం 37 బంతులు ఎదుర్కొన్న ష‌ఫాలీ 71 ప‌రుగులు చేసింది. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. దీనిని బ‌ట్టి చూస్తే ష‌ఫాలీ వ‌ర్మ గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై ఎలా విరుచుకుప‌డిందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న ఢిల్లీ నేరుగా ఫైన‌ల్‌కు చేరింది. 

ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎలిమినేట‌ర్ మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైన‌ల్ చేరుతుంది. శుక్ర‌వారం ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా, లీగ్ ద‌శ‌లో ముంబై, బెంగ‌ళూరు రెండు మ్యాచుల్లో త‌ల‌ప‌డ‌గా చెరో విజ‌యం న‌మోదు చేశాయి. దీంతో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య రేప‌టి ఎలిమినేట‌ర్ పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉండే అవ‌కాశం ఉంది. 

ఇక ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 17న‌) జ‌ర‌గ‌నుంది. ఇదిలాఉంటే.. డ‌బ్ల్యూపీఎల్ మొద‌టి సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ విజేత‌గా నిలిచింది. ఒక‌వేళ ఈసారి ముంబై ఎలిమినేట‌ర్‌లో ఓడితే మాత్రం కొత్త విజేతను చూడొచ్చు. ఢిల్లీ లేక బెంగ‌ళూరులో ఎవ‌రో ఒక‌రు రెండో సీజ‌న్ గెలిచే అవ‌కాశం ఉంటుంది.

More Telugu News