Iron Lungs: 70 ఏళ్లుగా ‘ఇనుప ఊపిరితిత్తుల’తో జీవించిన పోలియో రోగి మృతి!

  • 1952లో ఆరేళ్ల వయసులో పోలియో వ్యాధి బారిన పడ్డ అమెరికన్ పాల్
  • ఊరిపితిత్తుల కండరాలు చచ్చుబడటంతో మరణం అంచులకు చేరిన వైనం
  • పాల్‌కు కృత్రిమశ్వాస పరికరం ఐరన్ లంగ్స్‌ను అమర్చిన వైద్యులు
  • ఇటీవలే మరణించిన 78 ఏళ్ల పాల్
Polio patient Paul Alexander with iron lungs passes away at the age of 78

ఇనుప ఊపిరితిత్తుల రోగిగా పేరు పడ్డ అమెరికా వ్యక్తి తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 78 ఏళ్లు. టెక్సాస్‌కు చెందిన పాల్ అలెగ్జాండర్ 1952లో ఆరేళ్ల వయసున్నప్పుడు పోలియో వ్యాధి బారిన పడ్డాడు. అప్పటికి టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. 

చాలా మందికి అంగవైకల్యం కలిగించే పోలియో వ్యాధి పాల్ విషయంలో మరింత తీవ్రంగా పరిణమించింది. మెడ దిగువ భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఊపిరితిత్తుల కండరాలు కూడా పనిచేయకపోవడంతో శ్వాసతీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో వైద్యులు..అతడికి ఐరన్ లంగ్స్‌గా పేరుపడ్డ జీవనాధార వ్యవస్థను ఏర్పాటు చేశారు.  పెద్ద గొట్టం ఆకారంలో ఉండే ఈ పరికరంలో రోగిని ఉంచుతారు. ఇది పెషెంట్లకు బదులుగా శ్వాసతీసుకుని ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. 1955లో పోలియో టీకా అందుబాటులోకి వచ్చినా పాల్ విషయంలో అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. దీంతో, అతడు ఆ తరువాత 70 ఏళ్ల పాటు ఐరన్ లంగ్స్‌తోనే జీవించాడు. 

అయితే, ఒళ్లంతా చచ్చుబడినా కూడా ఆయన ఆశావహ దృక్పథంతో జీవించాడు. న్యాయశాస్త్రం అభ్యసించి లాయర్ అయిన పాల్.. ‘త్రీ మినిట్స్ ఫర్ డాగ్’ పేరిట తన ఆత్మకథను కూడా ప్రచురించారు. 

కాగా, పాల్ మార్చి 12న కన్నుమూసినట్టు వికలాంగుల హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ అల్మర్ గోఫండ్ మీ వెబ్‌సైట్‌లో (ఆన్‌లైన్ విరాళాల సేకరణ వేదిక) ప్రకటించారు. పాల్‌ను క్రిస్టోఫర్ 2022లో ఇంటర్వ్యూ చేశారు. ‘‘పాల్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసింది. అతడు ఎందరికో రోల్ మోడల్. అతడు ఎప్పటికీ మన మనసుల్లోనే ఉంటాడు’’ అని క్రిస్టోఫర్ రాసుకొచ్చాడు. 

వైరస్ కారణంగా వ్యాపించే పోలియో ఐదేళ్ల లోపు చిన్నారులను టార్గెట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. మానవ విసర్జితాల కాలుష్యం ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీని బారిన పడ్డ ప్రతి 2 వేల మందిలో ఒకరికి శరీరం చచ్చుబడుతుంది. 5 - 10 శాతం కేసుల్లో మాత్రం ఊపిరితిత్తుల కండరాలు కూడా చచ్చుబడటంతో రోగులు శ్వాస అందక మరణిస్తారు. ఇలాంటి వారి కోసమే అప్పట్లో ఐరన్ లంగ్స్ పరికరాన్ని రూపొందించారు. భారీ గొట్టం ఆకారంలో ఉండే ఈ యంత్రంలో రోగిని ఉంచి కృత్రిమ శ్వాస అందించేవారు. 1928లో తొలిసారిగా ఈ యంత్రాన్ని వినియోగించారు. ఇక టీకా అందుబాటులోకి వచ్చాక అనేక దేశాల్లో పోలియో వ్యాధి తుడిచిపెట్టుకుపోయింది.

More Telugu News