CEC Rajiv Kumar: జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం: సీఈసీ రాజీవ్ కుమార్

  • మీడియా సమావేశం నిర్వహించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
  • జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై వివరణ
  • దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి
CEC Rajiv Kumar press meet on Jammu Kashmir elections

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేడు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 

ఎన్నికల నిర్వహణపై జమ్మూ కశ్మీర్ లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరిగిందని వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని వివిధ పార్టీలు కోరాయని రాజీవ్ కుమార్ తెలిపారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా కశ్మీర్ రాజకీయ పక్షాలు కోరాయని పేర్కొన్నారు. 

అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కూడా పార్టీలు సూచించాయని చెప్పారు. వలసదారులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయని సీఈసీ వివరించారు. 

85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనాలని జమ్మూ కశ్మీర్ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఇక, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ సరైన సమయంలో విడుదల చేస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

More Telugu News