Bandi Sanjay: ఆ రోజు కేసీఆర్ తాగి పడుకుంటే... ప్రధాని మన్మోహన్ ఫోన్ చేసి రాజీనామా చేయమని చెప్పారు: బండి సంజయ్

  • కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చింది వాస్తవమా... కాదా? అని నిలదీత
  • తన నిర్లక్ష్యం... తాగుడు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని ఆరోపణ
  • స్మార్ట్ సిటీని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అన్న బండి సంజయ్
Bandi Sanjay fires at BRS chief KCR

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే... తాగి పడుకుంటే... నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి మరీ రాజీనామా చేయమని చెప్పింది వాస్తవమా... కాదా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఇదీ కేసీఆర్ చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. 

ఇవి వాస్తవమా.. కాదా?: కేసీఆర్‌కు బండి సంజయ్ నిలదీత

కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చింది వాస్తవమా... కాదా? నాడు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... పార్లమెంట్‌కు రాకుండా తాగిపడుకున్నది వాస్తవమా... కాదా? అందుకే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి నిన్ను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత... రెండురోజులు టైమ్ పాస్ చేసి... అవినీతి ఆరోపణల నుంచి... నీ నిర్లక్ష్యం నుంచి, నీ తాగుడు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తెలంగాణ నినాదం తీసుకువచ్చింది వాస్తవమా... కాదా? అని ప్రశ్నించారు. ఇదీ నీ చరిత్ర... ఇదీ బీఆర్ఎస్ నాయకుడి చరిత్ర అని ధ్వజమెత్తారు. 

స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం

కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపించారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం తాను అడిగినట్లు నాడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు మీతోనే చెప్పారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వివిధ కులాల కార్పోరేషన్ కేవలం మొక్కుబడి మాత్రమే అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయా కులాల ఓట్లు పొందేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. పంట బీమా సహా వివిధ పథకాల విషయంలో ఎన్నికల కోడ్ పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. 

వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి

కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ సింబల్‌పై పోటీ చేసే అభ్యర్థి స్వయంప్రకటిత మేధావి అని వినోద్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వినోద్ కుమార్ ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. ధరణిని అడ్డగోలుగా వాడుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహారా, ఈఎస్ఐ అంశాల్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్‌కు మరొకరి నిజాయతీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కరీంనగర్‌లోనే పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు జైలుకు పోయారన్నారు. ఇందుకు తాము పోలీసులను అభినందిస్తున్నట్లు చెప్పారు. భూకబ్జాదారులను జైల్లో వేసినందుకు ప్రజలు సంతోషిస్తున్నారన్నారు.

More Telugu News