Bengaluru water Crisis: బెంగళూరులో తీవ్ర స్థాయికి చేరిన నీటి కరవు

  • ఎండిన బోర్లు.. పత్తా లేని ట్యాంకర్లు
  • ప్రతీ నీటి చుక్కనూ జాగ్రత్తగా వాడుకుంటున్న జనం
  • వంట పాత్రలు కడిగేందుకు నీళ్లు లేక ఆన్ లైన్ లో ఆర్డర్
  • సొంతూళ్లకు వెళ్లే యోచనలో టెకీలు
Water Crisis Drives Bengaluru To The Edge

బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో గుక్కెడు తాగునీటికీ జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీ అంతటా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోక ప్రతీ నీటి చుక్కనూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడానికే సరిగా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుండడంతో వంట పాత్రలు కడగలేక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామని చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో తాను కేవలం ఐదు సార్లు మాత్రమే స్నానం చేశానని ఓ టెకీ చెప్పాడంటే నీటి కరవు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ట్యాంకర్ల ధరలపై ప్రభుత్వ నియంత్రణ..
సందట్లో సడేమియాలాగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సప్లైదారులు రేట్లు పెంచడంతో ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వాటర్ ట్యాంకర్ కు రేటు ఫిక్స్ చేసి, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో పరిస్థితి కాస్త చక్కబడుతుందని భావించిన జనాలకు కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వం కల్పించుకోవడంతో వాటర్ ట్యాంకర్ సప్లయర్లు ట్యాంకర్లను తగ్గించారని జనం ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా.. ఆ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదని, ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేందుకు అవకాశం కల్పించలేదని విమర్శిస్తున్నారు.

వర్క్ ఫ్రం హోం..
నీటి కటకట నేపథ్యంలో చాలా మంది టెకీలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఇంట్లో ఉంటూ నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, సొంతూళ్లకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెకీలు సొంతూళ్లకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ చేయడం వల్ల సిటీలో జనాభా తగ్గి నీటి కష్టాలు కొంత తగ్గుతాయని బెంగళూరు వాసులు అంటున్నారు. అపార్ట్ మెంట్లలో నివసించే వారి కష్టాలను ఓ మహిళా ఉద్యోగి ఏకరువు పెడుతూ.. తాముండే అపార్ట్ మెంట్ లో ఏడు బోర్లు ఉన్నాయని, కిందటి నెల వరకూ నీటికి ఇబ్బంది పడలేదని చెప్పారు. అయితే, ఉన్న ఏడు బోర్లు అడుగంటిపోయి చుక్క నీరు రాక నెల రోజులుగా అవస్థపడుతున్నామని వివరించారు. తమ అపార్ట్ మెంట్ కు రోజుకు నాలుగు ట్యాంకర్ల నీళ్లు అవసరం కాగా.. ఒకటి లేదా రెండు ట్యాంకర్లు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. గతంలో నీటికి రూ.700 లకు కాస్త అటూ ఇటూగా ఖర్చయ్యేదని, ఇప్పుడు ఈ మొత్తం దాదాపు రూ.2 వేలకు చేరిందని వివరించారు. అయినప్పటికీ సరిపడా నీళ్లు దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే అన్నీ చేయాలనడం సరికాదు..
బెంగళూరు నీటి కష్టాల నేపథ్యంలో అంతా ప్రభుత్వాన్నే నిందిస్తున్నారని మరో టెకీ చెప్పారు. ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ కష్టం వచ్చేది కాదంటున్నారు. కానీ ఉన్న నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం బెంగళూరు వాసులు చేయాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు జనం కూడా నీటిని పొదుపు చేయాలని, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని చెప్పారు.

ఆసుపత్రులలో రోగుల అవస్థలు..
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికీ నీటి కష్టాలు తప్పట్లేదు. ముఖ్యంగా డయాలసిస్ రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వైట్ ఫీల్డ్ లోని బ్రూక్ ఫీల్డ్ ఆసుపత్రిలో నీటి కరవు తీవ్ర ప్రభావం చూపుతోందని డాక్టర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. కేవలం డయాలసిస్ ప్రక్రియ కోసం రోజుకు 5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా గడిచిన మూడు రోజులలో ట్యాంకర్ల ద్వారా 24 వేల లీటర్ల నీటిని సప్లై చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆసుపత్రిలో మిగతా అవసరాలకు సరిపడా నీరు లేక రోగులు అవస్థ పడుతున్నారని వివరించారు.

More Telugu News