పవన్ కు నా మీద ఎందుకంత అసూయ అనేది అర్థం కావడం లేదు: గ్రంధి శ్రీనివాస్
- పవన్ తనను రౌడీ అన్నారని శ్రీనివాస్ మండిపాటు
- చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారని ఎద్దేవా
- సొంత అన్న నాగబాబును కూడా మోసం చేశారని విమర్శ
జనసేన కార్యకర్తలు తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ డైరెక్ట్ గా చెపుతున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఆయనను ఇష్టపడే వ్యక్తులకు ఆయనతో కలిసి సెల్ఫీ దిగే అవకాశం కూడా ఉండదని చెప్పారు. పవన్ నిజ స్వరూపం తెలియని అభిమానులు సీఎం సీఎం అంటుంటారని... నువ్వు మాత్రం 21 సీట్లకే పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావని ఎద్దేవా చేశారు.
చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు అసలు పోలికే లేదని శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు గెలిచారని... పవన్ మాదిరి విమర్శలు చేయలేక రాజకీయాల నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని దుయ్యబట్టారు. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్లీ భీమవరం ముఖమే చూడలేదని... కరోనా టైమ్ లో కూడా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తనను రౌడీ అని పవన్ అంటున్నారని... తన మీద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని చెప్పారు. తన గురించి భీమవరం ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు.