Mallikarjun Kharge: ఇప్పుడు నా వయసు 83 ఏళ్లు.. అందుకే ఈ నిర్ణయం:కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వివరణ

  • వయసు రీత్యా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడి
  • కార్యకర్తలు బలవంతం చేస్తే బరిలోకి దిగక తప్పదన్న కాంగ్రెస్ చీఫ్
  • మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? అని జర్నలిస్టులకు ప్రశ్న
  • తమ గ్యారెంటీలను మోదీ కాపీ కొడుతున్నారని ఎద్దేవా
Congress chief Mallikarjun Kharge skipping Lok Sabha polls

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటకలోని గుల్బార్గా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన వయసు ఇప్పుడు 83 సంవత్సరాలని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, కార్యకర్తలు కనుక పోటీచేయాల్సిందేనని పట్టుబడితే మాత్రం చెయ్యక తప్పదని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారట కదా? అన్న మీడియా ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు పోటీ నుంచి తప్పుకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదని, ఇప్పుడు తన వయసు 83 సంవత్సరాలని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మీరు (జర్నలిస్టులు) 65 ఏళ్లకే రిటైర్ అవుతారు కదా.. అలాగే తాను 83 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే, పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తే మాత్రం బరిలోకి దిగక తప్పదని స్పష్టం చేశారు. కొన్నిసార్లు ముందుండి నడిపిస్తే, మరికొన్ని సార్లు వెనక ఉండి నడిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమకు అందిన జాబితాలో ఒకే స్థానం నుంచి పోటీకి పదేసిమంది రెడీగా ఉన్నారని వివరించారు. 

బీజేపీ గ్యారెంటీలపై అడిగిన ప్రశ్నకు ఖర్గే బదులిస్తూ.. బీజేపీ తమ గ్యారెంటీలను చోరీ చేసిందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో గ్యారెంటీలు ప్రారంభించి గెలిచామని, ఆ తర్వాత అవే గ్యారెంటీలతో తెలంగాణలోనూ విజయం సాధించామని గుర్తుచేశారు. ఇప్పడు మా ఈ గ్యారెంటీలను మోదీజీ చోరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News