Praneeth Rao Arrested: విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్!

  • గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై ఫోన్‌ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌రావు
  • పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
  • ప్రణీత్‌రావును మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల ప్రకటన
  • హైదరాబాద్‌కు తరలింపు, పంజాగుట్ట పీఎస్‌లో విచారణ
Former DSP Praneeth Rao arrested in Rajanna siricilla district

గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్ ప్రణీత్‌కుమార్‌ అరెస్టయ్యారు. పంజాగుట్ట పోలీసులు ఆయనను మంగళవారం రాత్రి రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ)లో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్‌ ట్యాపింగ్, కంప్యూటర్ ధ్వంసం కేసులో ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

గత ప్రభుత్వంలో ప్రణీత్‌రావు ఎస్‌ఐబీలో డీఎస్పీగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్ 4న (ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు) ప్రణీత్ రావు కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్‌బీఐ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రణీత్‌రావు సస్పెన్షన్‌కు మునుపు రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. అయితే, సస్పెన్షన్ తరువాత జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు. 

ప్రణీత్‌రావును అరెస్టు చేసేందుకు సోమవారమే పంజాగుట్ట పోలీసుల బృందం సిరిసిల్లకు చేరుకున్నా జాడ దొరకలేదని సమాచారం. అయితే, స్థానిక శ్రీనగర్ కాలనీలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయనను అరెస్టు చేశామని మంగళవారం రాత్రి పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించి పంజాగుట్ట ఠాణాలో విచారణ చేస్తున్నారు. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్‌ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఫోన్‌ ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లో ఏ సమాచారం ఉంది? అనే కోణాల్లో ఆయనను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News