Kaleshwaram Project: సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కాళేశ్వరంపై విచారణ.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!

  • జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌తో కాళేశ్వరంపై విచారణ
  • విద్యుత్ రంగ అవకతవకలపై విచారణ చేపట్టనున్న హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి
  • మంగళవారం కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Retired supreme court justice to investigate on Kaleshwaram project

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై నిర్ణయించింది. 

కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని న్యాయస్థానం బదులిచ్చింది. దీంతో, విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. కాళేశ్వరం, విద్యుత్‌పై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

వీటిపైనే విచారణ

  • కాళేశ్వరానికి సంబంధించి మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది.
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యంపై విచారణ
  • కాంట్రాక్టుల జారీ, వాటి అమలులో ఆర్థిక క్రమశిక్షణ పాటించారా? లేదా? అన్నది నిర్ధారించడం
  • పనులు పూర్తికాకముందే ధ్రువీకరణ పత్రాల జారీ, బ్యాంకు గ్యారెంటీలు విడుదల వెనకున్న అధికారులను గుర్తించడం.
  • బ్యారేజీల నిర్వహణ, క్వాలిటీ కంట్రోల్ అండ్ మానిటరింగ్ అంశాలపై విచారణ
  • కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారుల మాల్‌ప్రాక్టీస్‌లపై విచారణ
  • గుర్తించిన వైఫల్యాల కారణంగా రాష్ట్రంపై పడే ఆర్థికభారంపై విచారణ
  • అదనపు అంశాలు ఉంటే గుర్తించి విచారణ పరిధిలోకి తేవడం

More Telugu News