Chandrababu: చంద్రబాబుతో ముగిసిన బీజేపీ పెద్దల సమావేశం... ఇంకా టీడీపీ అధినేత నివాసంలోనే పవన్

  • ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తు
  • నేడు చంద్రబాబు నివాసానికి వచ్చిన షెకావత్, పండా
  • దాదాపు 8 గంటల పాటు చర్చలు
  • చర్చలు ముగించుకుని వెళ్లిపోయిన బీజేపీ నేతలు
  • చంద్రబాబుతో కొనసాగుతున్న పవన్ చర్చలు
BJP leaders concludes talks with Chandrababu as Pawan Kalyan continues

ఏపీలో పొత్తు నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా సాగిన చర్చలు కొద్దిసేపటి కిందట ముగిశాయి. 

చంద్రబాబుతో కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా సమావేశం దాదాపు 8 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. చర్చలు ముగించుకుని షెకావత్, పండా వెళ్లిపోయినప్పటికీ... పవన్ కల్యాణ్ ఇంకా చంద్రబాబు నివాసంలోనే ఉన్నారు. 

ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల జాబితాల విడుదల, రాజకీయ వ్యూహం, చిలకలూరిపేట సభ నిర్వహణపై వీరిద్దరూ సమాలోచనలు చేస్తున్నారు.

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య గతేడాదే పొత్తు కుదరగా, కొన్ని రోజుల కిందటే బీజేపీతో పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.

బీజేపీ-జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రేపట్లోగా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News