Cotton Candy: ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచుమిఠాయిపై కర్ణాటకలో నిషేధం

  • ఇటీవల పీచు మిఠాయిపై పలు రాష్ట్రాల్లో నిషేధం
  • ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయన్న కారణంతో ప్రభుత్వాల నిర్ణయం
  • కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడుతున్న వంటకాలపై తాజాగా కర్ణాటకలో నిషేధాజ్ఞలు 
Karnataka bans cotton candy and food colour used manchuria

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగులో ఉండే ఈ పీచు మిఠాయిలో హానికారక రసాయన పదార్థాలు ఉన్నాయన్న కారణంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి. 

తాజాగా, కర్ణాటక ప్రభుత్వం కూడా పీచు మిఠాయి అమ్మకాలపై కొరడా ఝళిపించింది. అంతేకాదు, ఫుడ్ కలర్ వాడిన మంచూరియా వంటకం పైనా కర్ణాటక సర్కారు నిషేధం ప్రకటించింది. దీనిపై కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడుతూ, ఫుడ్ కలర్ వాడే వంటకాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. 

రాష్ట్రంలో 171 రకాల వంటకాల శాంపిళ్లను అధికారులు పరిశీలించారని, అందులో 107 వంటకాల్లో ప్రమాదకర కృత్రిమ రంగులు వాడుతున్నట్టు గుర్తించారని వివరించారు. 

రోడమైన్-బి, టార్ట్రాజిన్ వంటి రసాయనాల వల్ల ఆహార పదార్థాలకు ఆకట్టుకునే కలర్ వస్తుందని, అయితే ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అందుకే వీటిపై కర్ణాటకలో నిషేధం విధించామని... ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచు మిఠాయి ఎవరైనా అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి దినేశ్ గుండూరావు స్పష్టం చేశారు.

More Telugu News