Oscars 2024: ఆస్కార్‌ వేడుకలకు 'గాజా' నిరసనల సెగ.. వేదిక బ‌య‌ట భారీ ట్రాఫిక్ జామ్

Protests over Gaza war disrupt traffic outside Dolby Theatre
  • లాస్ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక‌గా ఘ‌నంగా ఆస్కార్ వేడుక‌లు  
  • ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మద్దతివ్వాలని వేదిక వద్ద‌ నిర‌స‌న‌
  • ట్రాఫిక్ అంత‌రాయంతో వేడుక‌కు ఆల‌స్య‌మైన ప‌లువురు ప్ర‌ముఖులు
  • గాజాకు మద్దతునిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధ‌రించిన‌ బిల్లీ ఇలిష్‌, ఫినియాస్‌ 
  • గాజాలో ఆరు వారాల కాల్పుల విరమణకు కృషి చేస్తామ‌న్న జో బైడెన్‌
ప్ర‌తిష్ఠాత్మ‌క 96వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఆదివారం రాత్రి లాస్ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిగింది. అయితే, ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతునివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు ఆస్కార్ వేడుక వేదిక వద్ద నిరసన‌కు దిగారు. ఈ నిరసనల కార‌ణంగా వేదిక బ‌య‌ట‌వైపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో పలువురు ప్రముఖులు ఆస్కార్ వేడుకలకు ఆలస్యంగా హాజరయ్యారు.

కాగా, నిరసనలపై ముందే సమాచారం ఉన్న లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు అప్ప‌టికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, అంతలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డెక్క‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్తింది. ఇక నిర‌స‌న‌కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, తమకు మద్దతుగా నిలవాలని అక్కడికి వచ్చే ప్రముఖులను కోర‌డం జ‌రిగింది. ఇదిలాఉంటే.. గాజాకు మద్దతునిస్తూ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డు అందుకున్న బిల్లీ ఇలిష్‌, ఫినియాస్‌ ప్రత్యేక బ్యాడ్జీని ధరించారు. ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన మరికొందరు కూడా వీరి బాటలోనే గాజాకు మద్దతు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

గాజాకు అమెరికా మ‌ద్ద‌తు
ఇక‌ గాజాలో ఆరు వారాల కాల్పుల విరమణ కోసం అమెరికా కృషి చేస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్‌ నిబంధనలకు కట్టుబడటం లేదని బైడెన్ మండిప‌డ్డారు. ఇది చాలా పెద్ద పొరపాటని ఆయ‌న‌ పేర్కొన్నారు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనియన్లు ఉంటున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్‌ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై కూడా జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అనుసరిస్తున్న తీరుపై బైడెన్‌ శనివారం మరోసారి అస‌హ‌నం వ్యక్తం చేశారు. బెంజమిన్ చ‌ర్య‌లు ఆయన సొంత దేశాన్నే గాయపరిచేలా ఉన్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే. ఇజ్రాయెల్‌కు యూఎస్‌ మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పడం గ‌మ‌నార్హం.
Oscars 2024
Gaza war
Dolby Theatre
Protests

More Telugu News