Revanth Reddy: జాగ్రత్త... హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తాం: రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • మెట్రో రైలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ లేఖ పంపించిందన్న రేవంత్ రెడ్డి
  • కానీ ఒకాయన కాళ్లలో కట్టె పెట్టినట్లుగా ప్రాజెక్టు ఆపాలని చెప్పారని తెలిసిందన్న ముఖ్యమంత్రి
  • మీకు చేయడానికి చేతకాలేదు... మేం చేసినప్పుడు కాళ్లలో కట్టె పెట్టవద్దని సూచన
Revanth Reddy warning about hyderabad development

జాగ్రత్తగా ఉండండి... హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ... తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిన్న చాంద్రాయణగుట్టలో తాను, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలిసి మెట్రో విస్తరణకు పునాదిరాయి వేశామని గుర్తు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ లేఖ కూడా పంపించిందన్నారు. పునాదిరాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దామనుకుంటే ఒకాయన కాళ్లలో కట్టె పెట్టినట్లుగా... ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఆపాలని చెప్పారని తెలిసిందని మండిపడ్డారు. మీకు చేయడానికి చేతకాకపోతే... మేం చేసినప్పుడు కనీసం కాళ్లలో కట్టె పెట్టవద్దని కోరారు.

'ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. కానీ హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వారికి ఈ వేదిక మీదుగా హెచ్చరిక జారీ చేస్తున్నాను... హైదరాబాద్ నగరం అభివృద్ధికి మీరు అడ్డుపడి... కేంద్ర ప్రభుత్వాన్ని ఉసిగొల్పి.. అడ్డుకునే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఇలాంటి పనులు చేసే వారికి హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి.. హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరించండి' అని సూచించారు.

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారి 44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనిని డబుల్ డెక్కర్ ఆకృతిలో నిర్మిస్తున్నారు.

More Telugu News