Balka Suman: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబోయే ఏక్‌నాథ్ షిండే... ఇప్పటికే బీజేపీతో మాట్లాడుతున్నాడు: బాల్క సుమన్

  • రేవంత్ రెడ్డి బీజేపీతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోందన్న బాల్క సుమన్
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని జోస్యం
  • బీజేపీ నేతలకు దొరకని అపాయింటుమెంట్ అంత తొందరగా రేవంత్ రెడ్డికి దొరికిందన్న బాల్క సుమన్
  • బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి రెండు గంటలు మాట్లాడుకున్నారని ఆరోపణ
Balka Suman alleges revanth reddy will join bjp

చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబోయే ఏక్‌నాథ్ షిండే, హిమంత బిశ్వ శర్మ అని... ఇతని నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకున్న తీరు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఆయన ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోందని... పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఆయన బీజేపీలో చేరుతారనే విషయాలు తెలుస్తున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొన్న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌లో పెద్దన్న అని వ్యాఖ్యానించారు... ఆ సభలో కూడా సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉన్న తీరును అందరూ గమనించాలన్నారు. మరోవైపు ఢిల్లీలో అడిగిందే తడవుగా రేవంత్ రెడ్డికి సులభంగా ప్రధాని అపాయింటుమెంట్ దొరికిందన్నారు. సొంత బీజేపీ నేతలకు కూడా అంత సులభంగా దొరకదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ చేశాయన్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుతో బేగంపేట విమానాశ్రయంలో దాదాపు రెండు గంటల మాట్లాడారని ఆరోపించారు. మొన్న ప్రధాని మోదీతో రేవంత్ మాట్లాడారని, నిన్న చంద్రబాబు-రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారని, ఈ రోజు బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారన్నారు. రేవంత్ రెడ్డిని తప్పకుండా మీ వద్దకు తీసుకు వస్తానని గురువు చంద్రబాబు ప్రధాని మోదీకి మాట ఇచ్చారని ఎద్దేవా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుకు చెందిన టీడీపీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిందని ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా తుమ్మల నాగేశ్వర రావు వంటి మంత్రులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారన్నారు.

గురువు చంద్రబాబు ఆదేశాల మేరకే 2014లో తాము అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు. అంతకుముందు ఉద్యమం సమయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రైఫిల్ పట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎంత చెబితే అంత అన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని... కాంగ్రెస్, టీడీపీ కుట్రలను గుర్తించాలని కోరారు.

నాడు చంద్రబాబు హయాంలో చూశాం... ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో చూస్తున్నాం...

నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పోలీసుల వేధింపులు, కక్ష సాధింపులు, నీటి ఇబ్బందులు, బోర్లలో నీళ్లు ఎండిపోయాయని... మళ్లీ ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి హయాంలో అలాంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాత కాంగ్రెస్ నాయకులను వదిలేసి... తన వారిని తీసుకొని రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్నారు. ఇలాంటివి చంద్రబాబుకు తెలిసిన విద్య అన్నారు. 2019లో టీడీపీ ఓడిపోగానే సీఎం రమేశ్, సుజనా చౌదరి వంటి నేతలను బీజేపీలో చేర్పించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ టీమ్ అంతా ఒక్కటే అన్నారు. ఇలాంటి కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

More Telugu News