Rohit Sharma: టీమిండియా ఘనవిజయంపై రోహిత్ శర్మ స్పందన

  • ముగిసిన టీమిండియా-ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్
  • 4-1తో విజేతగా నిలిచిన టీమిండియా
  • చివరి టెస్టులోనూ నెగ్గిన రోహిత్ సేన
Rohit Sharma talks about Team India series win over England

బజ్ బాల్ క్రికెట్ అంటూ భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టును ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 4-1తో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టును ఘనంగా నెగ్గిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిపోయి కుదేలైంది. కొందరు స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ రోహిత్ శర్మ సైన్యం వరుసగా నాలుగు టెస్టుల్లో ఘనవిజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదు. 

ధర్మశాలలో నేడు ముగిసిన చివరి టెస్టులోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ మూడ్రోజుల్లోపే ముగియడం టీమిండియా ఆధిపత్యానికి నిదర్శనం. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఓ దశలో టీమిండియాపై కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలే తమలో కసి రగిల్చాయని వెల్లడించాడు. 

ఈసారి టీమిండియాలోకి కొందరు అనుభవం లేని కుర్రాళ్లు వచ్చారని, అయినప్పటికీ పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ ను చిత్తు చేశామని చెప్పాడు. కొత్త కుర్రాళ్లు అయినప్పటికీ, ఒత్తిడిని లెక్క చేయకుండా వారు ధైర్యంగా ఆడారని, పరిస్థితులకు అనుగుణంగా వారు స్పందించిన తీరు ఆకట్టుకుందని రోహిత్ శర్మ కితాబునిచ్చాడు. 

ఓ సిరీస్ అనగానే సెంచరీల గురించే మాట్లాడుతుంటారని, కానీ ప్రత్యర్థి జట్టుకు చెందిన 20 వికెట్లను తీయడం కూడా ముఖ్యమైన అంశమేనని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గాయం నుంచి కోలుకుని వచ్చాక కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అతడి బౌలింగ్ ప్రదర్శన అమోఘం అని కొనియాడాడు. 

ఇక, ఇంగ్లండ్ తో టెస్టు  సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన యువ ఓపెనర్ యశిస్వ జైస్వాల్ పైనా రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. జైస్వాల్ కు అద్భుతమైన భవిష్యత్ ఉందని అన్నాడు. అతడు చాలాకాలం పాటు టీమిండియాకు సేవలు అందించే సత్తా ఉన్న ఆటగాడు అని పేర్కొన్నాడు.

More Telugu News