High Court: హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌బ్ద ప‌రిమితుల‌పై వివ‌రాలు కోరిన హైకోర్టు

  • వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని రాష్ట్ర స‌ర్కార్‌కు ఆదేశం
  • బోయిన‌ప‌ల్లిలోని పంక్ష‌న్ హాల్స్ శ‌బ్ద కాలుష్యంపై క‌ల్న‌ల్ స‌తీష్ భ‌ర‌ద్వాజ్ హైకోర్టుకు లేఖ‌
  • లేఖ‌ను పిల్‌గా స్వీక‌రించిన హైకోర్టు 
  • చీఫ్ జ‌స్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన డివిజ‌న్ బెంచ్ విచార‌ణ‌
High Court seeks Details on Noise limits in Hyderabad city

హైద‌రాబాద్ న‌గ‌రంలో శ‌బ్ద ప‌రిమితుల‌పై జారీ చేసిన స‌ర్క్యుల‌ర్, దాని అమ‌లు తీరుపై వివ‌రాలు ఇవ్వాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు కోరింది. న‌గ‌రంలోని పంక్ష‌న్ హాల్స్‌లో పెట్టే సౌండ్ ప‌రిమితుల‌కు లోబ‌డి ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం తెలిపింది. తాడ్‌బండ్ బోయిన‌ప‌ల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియ‌ల్ గార్డెన్స్ పంక్ష‌న్ హాల్స్ నుంచి భారీ శ‌బ్ద కాలుష్యం వెలువ‌డుతోందని పేర్కొంటూ మిలిట‌రీ అద‌న‌పు చీఫ్ ఇంజినీరు క‌ల్న‌ల్ స‌తీష్ భ‌ర‌ద్వాజ్ రాసిన లేఖ‌ను హైకోర్టు పిల్‌గా స్వీక‌రించింది. ఈ పిల్‌ను చీఫ్ జ‌స్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన డివిజ‌న్ బెంచ్ విచారించింది. 

ఇక ప్ర‌భుత్వం త‌ర‌ఫున అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. శ‌బ్ద కాలుష్యం అంశం‌పై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని న్యాయ‌స్థానానికి తెలిపారు. దీని ప్ర‌కారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత డీజే సౌండ్స్ ఉండ‌కూడ‌ద‌ని వెల్ల‌డించారు. పిటిష‌న‌ర్ చెబుతున్న రెండు పంక్ష‌న్ హాల్స్ ప‌రిధిలో పెట్రోలింగ్ నిర్వ‌హించేలా పోలీసుల‌కు ఆదేశాలు ఇస్తామ‌ని తెలిపారు.

దీనిపై రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ.. బోయిన‌ప‌ల్లిలో శ‌బ్ద కాలుష్యం వెలువ‌డే ఫంక్ష‌న్ హాల్స్‌పై చ‌ర్య‌లు తీసుకునే అధికారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఉంద‌ని గుర్తు చేసింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బోర్డును ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తూ.. శ‌బ్ద కాల‌ష్య నిబంధ‌న‌ల‌పై జారీ చేసిన ఉత్త‌ర్వుల గురించి నివేదిక ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News