Virat Kohli: ఐపీఎల్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఐపీఎల్‌ను కచ్చితంగా ఇష్టపడతానని అభిమానాన్ని చాటుకున్న కోహ్లీ
  • ఆటగాళ్లు, అభిమానులను అనుసంధానం చేసే లీగ్ ఇదని వ్యాఖ్య
  • ఇతర జట్ల ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డ స్టార్ బ్యాటర్
Virat Kohli Made interesting comments before the start of IPL

క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానేవచ్చింది. మార్చి 22న ఐపీఎల్-17వ ఎడిషన్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు తమతమ జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా వస్తున్న ఐపీఎల్ అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాట్స్‌మెన్, ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ ఐపీఎల్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశాడు. ఆటగాళ్లు, అభిమానులను ఐపీఎల్ అనుసంధానిస్తుందని విరాట్ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్‌ను ఫాలో కావడానికి ఇదే కారణమని చెప్పాడు. 

‘‘ నేను కచ్చితంగా ఐపీఎల్‌ను అభిమానిస్తున్నాను. ఆటగాళ్ల మధ్య స్నేహభావం, చాలా మంది కొత్త ఆటగాళ్లతో ఆడడం, చాలా మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉండడం కారణాలుగా చెప్పచ్చు. ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌ను ఇష్టపడటానికి ఒక కారణం ఉంది. ఆటగాళ్లు, అభిమానుల మధ్య కనెక్షన్ ఇందుకు కారణం’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కోహ్లీ అన్నాడు. ఇక ఐపీఎల్‌కి, ఐసీసీ టోర్నమెంట్‌ మధ్య వ్యత్యాసం ఏంటని ప్రశ్నించగా.. ప్రతి మ్యాచ్ తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లతో సంభాషించడం ఐపీఎల్‌లో భిన్నంగా అనిపిస్తుందని వ్యాఖ్యానించాడు. 

ఐసీసీ టోర్మమెంట్లు అప్పుడప్పుడు వస్తాయి. ఈ టోర్నీలలో ఇతర జట్ల ఆటగాళ్లతో పెద్దగా మాట్లాడరు. ఇతర జట్టును తరచుగా చూడడం కూడా జరగదు. కానీ ఐపీఎల్‌లో ప్రతి మూడు రోజులకు ఒక జట్టు చొప్పున అన్ని జట్లను కలుస్తూనే ఉంటాం. అదే ఐపీఎల్ ప్రత్యేకత. వేర్వేరు జట్లతో వేర్వేరు నగరాల్లో విభిన్న పరిస్థితుల్లో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. టోర్నమెంట్‌లోని వివిధ దశలలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన సంకల్పం ఉంటుంది. ఆటలో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

కాగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తిరిగి మైదానంలో అడుగుపెడతాడని భావిస్తున్నారు. కాగా ఆర్సీబీకి కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో మొత్తం 7,263 పరుగులు బాది అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి.

More Telugu News