Harish Rao: ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు: హరీశ్ రావు

  • ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన మీడియా సంస్థతో వార్తను సరిచేయించామన్న హరీశ్ రావు
  • ఉద్యోగుల పక్షాన గొంతెత్తింది తానేనన్న హరీశ్ రావు
  • కొందరు కావాలని చేస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి
Harish Rao clarifies on employees salaries issue

ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన మీడియా సంస్థకు రిజాయిండర్ పంపించి, వార్తను సరిచేయించడం జరిగిందన్నారు. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.

ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదేపదే నిలదీస్తూ వస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానన్నారు. ఎల్లప్పుడూ ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలిచే తనపై కొందరు కావాలని చేస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని... ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరవు భత్యాలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని సూచించారు. పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు.

More Telugu News