Financial Security: మీ జీవన గమనాన్ని మార్చే ఈ ఏడు అలవాట్లు చేసుకుంటే.. మీకిక తిరుగులేనట్టే!

  • భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏడు అలవాట్లు ఇవే
  • ఆత్మవిశ్వాసంతో జీవించాలంటే ఈ పద్ధతులు అనుసరించాల్సిందే
  • బహుళ ఆదాయ మార్గాలతో సుఖమయ జీవనం
  • అద్దె ఇల్లా? సొంత ఇల్లా అనే విషయంలో స్పష్టత అవసరం
  • భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసే చెడు పెట్టుబడులు
Seven financial habits to help you boost your finances

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నారు. భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో మెలుగుతూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ కష్టాలపాలు కాకుండా చేస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నవారు సరే.. మరి ఇప్పుడిప్పుడే అటువైపు దృష్టిసారిస్తున్న వారి సంగతేంటి? ఆర్థిక భరోసాకు వారు అవలంబించాల్సిన పద్ధతులేంటి? ఎలాంటి అలవాట్లు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

తొలుత మనం ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆకస్మిక ఖర్చులు వచ్చి మీద పడితే కంగారుపడిపోవాల్సిన పనిలేకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం కనీసం ఆరు నెలల నుంచి ఏడాదికి సరపడా నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఏడాదిపాటు ఆదాయం లేకున్నా ఇల్లు సాఫీగా గడిచే ఏర్పాటన్నమాట ఇది.

ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనకు అర్ధం కాని దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకూడదు. ఏదైనా సమాచారం విషయంలో పారదర్శకత లేదనుకుంటే దానికి దూరంగా ఉండడం అత్యుత్తమ మార్గం. పెట్టుబడికి ముందు ఆ సంస్థ నిర్మాణ స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అనుమానం వస్తే వెనక్కి తగ్గిపోవడం తెలివైన పని. అంతేకానీ, మిస్ అవుతున్నామన్న భావనను దరిచేరనీయవద్దు. మరీ ముఖ్యంగా పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆర్థిక నిపుణుల సలహాలు పాటించండి.

ఆర్థిక విషయాల్లో దురాశకు పోకూడదు. డబ్బు పట్ల ఆరోగ్యకరమైన దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. డబ్బు సంపాదన, ఖర్చు, పొదుపు, పెట్టుబడి వంటివి చాలా ముఖ్యమైన విషయాలు. ఏది ఎంతమేర చేస్తున్నామనే విచక్షణ మర్చిపోకూడదు. జీవిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ఇల్లు కొనుగోలు, ఉన్నత విద్య, యాత్రలకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాటిలో దేనిని ఎంచుకోవాలన్న విచక్షణ అవసరం.

ముఖ్యంగా ఇల్లు కొనుగోలు విషయంలో చాలామంది రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. చాలామంది సొంతింటివైపు మొగ్గు చూపిస్తుంటారు. ఇల్లు కొనుగోలు అంటే మనల్ని మనం ఒకే ప్రదేశానికి కట్టుబడి ఉండేలా చేసుకోవడమే. దీర్ఘకాలం పాటు రుణం చెల్లిస్తూ ఉండాల్సి రావొచ్చు. నిజానికి ఇది అంత ఆచరణీయం కాదు. అవకాశాలు, అనుభవాలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు కొన్నిసార్లు అద్దెకు ఉండడమే ఉత్తమమైన ఎంపిక అవుతుంది. అయితే, తప్పకుండా స్థిరాస్తిని కలిగి ఉండాలనుకోవడం, ఒకే చోట నివసించాలని అనుకోవడం వంటి అభిప్రాయాలుంటే మాత్రం అప్పుడు ఇంటి కొనుగోలుపై దృష్టిసారించవచ్చు. 

డబ్బు సంపాదనకు చాలామంది షేర్లలో పెట్టబడులు పెడుతుంటారు. అయితే, మనం పెట్టే పెట్టుబడి ఎటువంటిదన్న విషయంపై స్పష్టత ఉండాలి. చెడు పెట్టుబడులు ఒక్కోసారి నిండా ముంచేయవచ్చు. చెడు పెట్టుబడి భవిష్యత్తును, భవిష్యత్తు సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. కాబట్టి మనం ఎందులో పెట్టుబడి పెడుతున్నామన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ఆయా రంగాల్లోని నిపుణుల సలహా తీసుకోవాలి.

 భవిష్యత్తుకు భరోసా నింపే వాటిలో బహుళ ఆదాయ మార్గాలు ఒకటి. దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకునేందుకు బహుళ ఆదాయ మార్గాలు కలిగి ఉండడం ఎంతో కీలకం. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు మీ ప్రమేయం లేకుండానే మీకు డబ్బును సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి అద్దె రావడం వరకు ఇలా వివిధ రూపాల్లో ఇది ఉంటుంది.

భవిష్యత్తుకు భరోసా కల్పించుకున్నారు సరే.. అక్కడితో మీ బాధ్యత తీరిపోలేదు. మీ ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం కొంత సమాజానికి వెనక్కి ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు విరాళాలు అందించండం, మూగ జీవాల కోసమో, అన్నార్తుల కోసమో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వంటివి మానసిక తృప్తిని అందిస్తాయి. మీకు ఎందులో తృప్తి లభిస్తుందో దాని కోసం పనిచేయడం అలవాటు చేసుకోండి.

More Telugu News