Pawan Kalyan: భీమ‌వ‌రం నుంచి ఎవ‌రు అభ్య‌ర్థిగా పోటీ చేసినా.. జ‌నసేన గెల‌వాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ముఖ్య నేత‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ 
  • భీమ‌వ‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమ‌న్న జ‌న‌సేనాని
  • జ‌న‌సేన‌లో చేర‌నున్న భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే రామాంజ‌నేయులు
Janasena President Pawan Kalyan Meeting at Bhimavaram

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. వ‌ప‌న్ మాట్లాడుతూ.. 'భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎవ‌రు అభ్య‌ర్థిగా పోటీ చేసినా, అక్క‌డ జ‌నసేన గెల‌వాలి' అన్నారు. ఇప్పుడు ఏ ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ప‌ని చేస్తున్నాయో.. అంత‌కుమించిన ఉత్సాహంతో ప‌ని చేయాల‌ని సూచించారు. భీమ‌వ‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమ‌ని, పార్టీ గెల‌పున‌కు క్యాడ‌ర్ అంతా సిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. 

కాగా, భీమ‌వ‌రం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసే అవ‌కాశాల‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతున్న వేళ ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక భేటీలో భాగంగా పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ క‌న‌క‌రాజు సూరి, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కొటిక‌ల‌పూడి గోవింద‌రావు, పార్టీ మ‌రో కీల‌క నేత చెన‌మ‌ల్ల చంద్ర‌శేఖ‌ర్‌ల‌తో ముందుగా ప‌వ‌న్ విడిగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా నెల‌కొన్న తాజా ప‌రిస్థితులు, రాజకీయ ప‌రిణామాల‌పై నేత‌ల‌తో జ‌న‌సేనాని చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు కూడా పాల్గొన్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై పోటీ చేశారు. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేర‌తాన‌ని రామాంజ‌నేయులు తెలిపారు.

More Telugu News