Supreme Court: ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది: సుప్రీంకోర్టు

  • ప్రతి విమర్శను నేరంగా భావిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని వ్యాఖ్య
  • రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ కింద అసమ్మతి తెలియజేయవచ్చని వెల్లడి
  • ఆర్టికల్ 370 రద్దు చేసిన తేదీని ‘బ్లాక్ డే’గా పేర్కొన్న వ్యక్తిపై మహారాష్ట్రలో కేసు నమోదు.. కొట్టివేసిన సుప్రీంకోర్టు
Every Citizen Has Right To Criticise Any Decision of State sasys Supreme Court

ప్రతి విమర్శ నేరం కాదని, అలా భావిస్తే ప్రజాస్వామ్య మనుగడ సాగించలేదంటూ ‘అసమ్మతి హక్కు’ను సుప్రీంకోర్టు సమర్థించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం విషయంలో పోలీసులు అప్రమత్తతతో ఉండాలని కోర్టు సూచించింది. 

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) వాక్, భావప్రకటనా స్వేచ్ఛ హక్కులకు భరోసా కల్పిస్తోంది. ఈ హక్కు కింద ప్రతి పౌరుడికి ఆర్టికల్ 370 రద్దు చర్యపై విమర్శలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్న విషయాన్ని తెలియజేసే హక్కు పౌరులకు ఉంటుంది. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన సహేతుకమైన పరిమితులపై పోలీసు యంత్రాంగానికి అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తేదీ ఆగస్టు 5ను ‘బ్లాక్ డే’గా పేర్కొంటూ మహారాష్ట్రలోని కొల్హాపూర్ కాలేజీలో పనిచేస్తున్న కశ్మీరీ ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజామ్‌ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అంతేకాదు ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీంతో పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు ప్రొఫెసర్‌పై కేసుని కొట్టివేయాలని ఆదేశించింది. ఆగస్టు 5వ తేదీని ‘బ్లాక్ డే’గా పేర్కొనడం ‘నిరసన, బాధను తెలియజేయడం’ అవుతుందని కోర్టు పేర్కొంది. ఇక పాకిస్థాన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సదుద్దేశానికి సంకేతంగా భావించాలని పేర్కొంది. భిన్న మత సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా ద్వేషపూరిత భావాలను సృష్టించేందుకు ప్రయత్నించారని చెప్పలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

More Telugu News