Sunrisers Hyderabad: జెర్సీ మార్చిన సన్ రైజర్స్... అక్కడ కలిసొచ్చింది మరి!

  • మార్చి 22 నుంచి ఐపీఎల్-2024
  • ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు
  • కొత్త జెర్సీలతో ఫొటో షూట్
  • దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ను వరుసగా రెండు సార్లు గెలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
  • ఆ టోర్నీలో ఉపయోగించిన జెర్సీలే ఇప్పుడు ఐపీఎల్ లో వినియోగం
Sunrisers Hyderabad unveils new jersey

ఐపీఎల్ విజేతల  జాబితా చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు కూడా కనిపిస్తుంది. కానీ గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు నాసిరకం ఆటతో పాయింట్ల పట్టికలో దిగువకే పరిమితమవుతోంది. కొన్నిసార్లు దారుణమైన ఆటతీరుతో విమర్శకులకు పని కల్పిస్తుంటుంది. అయితే, ఈసారి ఆ చెడ్డపేరు తొలగించుకోవడానికి సన్ రైజర్స్ యాజమాన్యం భారీ మార్పులు చేపట్టింది.

ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. 

వేలంలో డబ్బు చాలా పొదుపుగా ఖర్చు పెడతారని పేరున్న సన్ రైజర్స్ యజమానులు ఈసారి వేలంలో విజృంభించి ఖర్చు పెట్టారు. కమిన్స్ ను రికార్డు స్థాయిలో రూ.20.50 కోట్లతో కొనుగోలు చేసి మిగతా ఫ్రాంచైజీలు నివ్వెరపోయేలా చేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి పలికిన అత్యధిక ధర ఇదే. 

ఇక అసలు విషయానికొస్తే... సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జట్టు రూపురేఖలతో పాటే జెర్సీ కూడా మార్చేసింది. ఆరెంజ్ కలర్ ను మిస్ కాకుండా వాటిపై నల్లని చారలను జిగ్ జాగ్ గా ప్రింట్ చేసిన జెర్సీలను సన్ రైజర్స్ తన ఆటగాళ్లకు అందించింది. 

మార్చి 22న ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలతో ఫొటో షూట్ కు హాజరయ్యారు. 

ఈ జెర్సీ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎలాగంటే... దక్షిణాఫ్రికాలో గత రెండు సీజన్లుగా ఎస్ఏ టీ20 లీగ్ ను గెలిచింది ఎవరో కాదు... సన్ రైజర్స్ జట్టే. ఐడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా 2023, 2024 సీజన్లలో చాంపియన్ గా నిలిచింది. 

ఆ టోర్నీలో ఏ డిజైన్ జెర్సీలు వాడారో, ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ ఆటగాళ్లకు అదే డిజైన్ తో ఉన్న జెర్సీలు అందించారు. కలిసొచ్చిన జెర్సీతో అయినా ఐపీఎల్ లో తమ భాగ్యరేఖ మారుతుందేమోనని సన్ రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది. ఐపీఎల్-2024లో సన్ రైజర్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది.

More Telugu News