YS Sharmila: తల్లి వంటి ఏపీకి జగన్ వెన్నుపోటు పొడిచారు... ఆయన వైఎస్ వారసుడా?: షర్మిల

  • మంగళగిరిలో కాంగ్రెస్ సమావేశం
  • ప్రత్యేక హోదా అంశంపై కంటతడి పెట్టుకున్న షర్మిల
  • ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని విమర్శలు
  • రాహుల్ మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టీకరణ
Sharmila slams YS Jagan

మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు అవుతాడా? అని ప్రశ్నించారు. 

ఇక, తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత కారణాలతో కాదని స్పష్టం చేశారు. అలాగైతే తాను 2019లోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండేదాన్నని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ... ఆయన మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లో ప్రవేశించానని షర్మిల పేర్కొన్నారు. 

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఏం చేశారని, మోదీ అంటే తనకు గౌరవం అని పవన్ అంటున్నారు? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరించారు. 

ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని ఉద్ఘాటించారు. ఓవైపు బీజేపీ.... మరోవైపు అధికారపక్షం, విపక్షం ప్రత్యేక హోదా పేరిట ప్రజలను మోసం చేస్తుంటే బాధగా ఉందని షర్మిల కంటతడి పెట్టుకున్నారు.

More Telugu News