Leopard: సెల్‌ఫోన్ ఆటలో మునిగిపోయిన బాలుడు.. నేరుగా ఇంట్లోకి చిరుత.. తెలివిగా ఎలా బంధించాడో చూడండి!

  • మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘటన
  • బాలుడికి అడుగు దూరం నుంచీ ఇంట్లోకి వెళ్లిన చిరుత
  • గమనించకపోవడంతో బతికిపోయిన చిన్నారి
  • నెమ్మదిగా సోఫా దిగి బయటకు వెళ్లి గడియపెట్టిన వైనం
  • బాలుడి ధైర్యానికి సోషల్ మీడియా ఫిదా
Boy Saw A Leopard Entering A Room Quickly Locked It Inside

ఇంట్లో సోఫాలో కూర్చున్న బాలుడు సెల్‌ఫోన్‌ చూడడంలో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ చిరుత తలుపు తీసి ఉండడంతో నేరుగా ఇంట్లోకి ప్రవేశించింది. చిరుత ఇంట్లోకి వచ్చాక గానీ గుర్తించలేకపోయిన కుర్రాడు దానిని చూశాక హడలిపోయాడు. అయితే, ఆ భయాన్ని అణచిపెట్టి తెలివిగా వ్యవహరించాడు. నెమ్మదిగా సోఫా దిగి బయటకు వెళ్లి తలుపు వేసేశాడు. ఆ చిన్నారి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని మాలేగావ్‌లో జరిగిందీ ఘటన. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టిన చిరుత ఓ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా తలుపు తెరిచి కనిపించింది. వెంటనే ఆ ఇంట్లో ప్రవేశించింది. డోర్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్న13 ఏళ్ల బాలుడికి దాదాపు అడుగు దూరం నుంచే అది ఇంట్లోకి వెళ్లినప్పటికీ అతడిని గుర్తించలేకపోయింది. గుర్తించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇంట్లోకి ఎవరో వచ్చారని డౌటొచ్చిన బాలుడు సెల్‌ఫోన్‌లోంచి తల తిప్పి చూస్తే చిరుత కనిపించింది. అంతే.. ఒక్కక్షణం ఒళ్లంతా చెమటలు పట్టాయి. అయినప్పటికీ అరవలేదు, భయపడలేదు. నెమ్మదిగా సోఫా దిగి క్షణాల్లో బయటకు వెళ్లి తలుపు వేసేశాడు.

ఈ మొత్తం ఘటన బాలుడి ఇంట్లోని సీసీటీవీలో రికార్డయింది. ఆపై సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. అది చూసినవారు బాలుడి సమయస్ఫూర్తిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తుమందు ఇచ్చి బోనులో బంధించి తీసుకెళ్లారు.

More Telugu News