Yashasvi Jaiswal: నేటి నుంచే ధర్మశాల టెస్ట్.. యశస్వి జైస్వాల్‌ను ఊరిస్తున్న 5 రికార్డులు!

  • మరొక్క పరుగు చేస్తే ఇంగ్లండ్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్న యశస్వి జైస్వాల్
  • మరో 29 పరుగులు చేస్తే ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్
  • నేటి ధర్మశాల వేదికగా చివరి టెస్టులో తలపడనున్న ఇరు జట్లు
5 Records Yashasvi Jaiswal can break in series finale in Dharamsala against England

భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో చివరిదైన 5వ టెస్ట్ నేటి (గురువారం) నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత  యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. వెస్టిండీస్‌పై సిరీస్‌లో అరంగేట్రం చేసినప్పటికీ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఒక సిరీస్‌లో ఏకంగా 655 పరుగులు బాదిన భారత్‌ తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా జైస్వాల్ ఇప్పటికే రికార్డు సాధించాడు. మరోవైపు తొలి మూడు సెంచరీలు 150 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 23 సిక్సర్లు కొట్టిన జైస్వాల్ ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. వీటితో పాటు ధర్మశాల మ్యాచ్‌లో మరో 5 రికార్డులు జైస్వాల్‌ను ఊరిస్తున్నాయి.

జైస్వాల్ ముందున్న రికార్డులు..

  • జైస్వాల్ మరొక్క పరుగు సాధిస్తే ఇంగ్లండ్‌పై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 655 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటికే 655 పరుగులు బాదాడు.
  • జైస్వాల్ మరో 98 పరుగులు సాధిస్తే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. 1990 సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ గ్రాహం గూచ్‌ భారత్‌పై ఏకంగా 752 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.
  • ధర్మశాల టెస్టులో జైస్వాల్ 29 పరుగులు చేస్తే టెస్ట్ కెరియర్‌లో 1000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతానికి 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 971 పరుగులు చేశాడు. ఆడిన మ్యాచ్‌లను లెక్కలోకి తీసుకుంటే వేగంగా తొలి 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అవతరించనున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రస్తుతం వినోద్ కాంబ్లి పేరిట రికార్డు వుంది. జైస్వాల్ 8 టెస్టులు ఆడి ఇప్పటికే 15 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు.
  • జైస్వాల్ ధర్మశాల టెస్టులో మరో 120 పరుగులు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్-టైమ్ రికార్డు బ్రేక్ కానుంది. 1970/71లో వెస్టిండీస్‌పై గవాస్కర్ 774 పరుగులు బాదాడు. దీనిని జైస్వాల్ అధిగమించే అవకాశం ఉంది.
  • యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో మరో 11 సిక్సర్లు కొడితే టెస్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. 2014లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ఏకంగా 33 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైస్వాల్ ఈ ఏడాది ఇప్పటికే 23 సిక్సర్లు బాదాడు. ఒక ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ను ఈ యువ ఆటగాడు అధిగమించాడు.

More Telugu News