Harish Rao: వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లవ్ లెటర్ రాశారు: హరీశ్ రావు వ్యంగ్యం

  • రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు... కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ధైర్యం ఉన్నప్పుడు మోదీ సహకారం ఎందుకు కోరుతున్నారో చెప్పాలని నిలదీత
  • 100 రోజుల పాలనలో ఏముందని రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓటేయాలని అడుగుతున్నారని ప్రశ్న
Harish rao fires at Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు... కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని అన్నారు. మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడారని... తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారన్నారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ గాంధీ అన్న విషయం గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటూనే అదే మోడల్‌ కావాలంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే ధైర్యం ఉన్నప్పుడు మోదీ సహకారం ఎందుకు కోరుతున్నారో చెప్పాలన్నారు. బీజేపీ తమ పార్టీ ఎంపీలను లాక్కుంటోందని ధ్వజమెత్తారు.

బుధవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 100 రోజుల పాలనలో ఏముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలనను చూసి ఓటు వేయాలని అడుగుతున్నారో చెప్పాలన్నారు. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని... తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. కానీ ఇప్పుడు సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారని నిలదీశారు.

10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని.. అలాంటప్పుడు మోదీని పొగడటం ఏమిటి? అని నిలదీశారు. మూడు నెలల పాలనలో రేవంత్‌రెడ్డి అటు ప్రజలను... ఇటు కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి... ఈ రోజు వరకు చేయలేదన్నారు. కనీసం బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేదని విమర్శించారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్నారని... ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. వచ్చే యాసంగికైనా బోనస్ ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరవు వచ్చిందని వ్యాఖ్యానించారు. ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోసే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయని.. అవన్నీ అమలయ్యేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. మహిళలను మహాలక్ష్మీలను ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి... ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏమిటన్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు, ఆటో అన్నలకు రూ.12వేలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. ఫ్లోర్లలో ఉండే కుటుంబాలకు అన్ని మీటర్లకు ఉచిత విద్యుత్‌ అమలులో లేదని... అలాంటప్పుడు ఎందుకు ఓటు వేయాలన్నారు.

More Telugu News