Chandrababu: మరో రెండు మూడు మీటింగులు చాలు... వైసీపీ పని ఫినిష్: చంద్రబాబు

  • మంగళగిరిలో జయహో బీసీ సభ
  • బీసీ డిక్లరేషన్ విడుదల
  • బీసీ డిక్లరేషన్ ను ఆషామాషీగా తీసుకురాలేదన్న చంద్రబాబు
  • ఎంతో అధ్యయనం చేశామని వెల్లడి
  • ఇది చరిత్రను తిరగరాసే డిక్లరేషన్ అని ఉద్ఘాటన
Chandrababu says YCP must lose another two three meetimg

మంగళగిరి జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ జనసేన, టీడీపీ పార్టీలు సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ను ఈ సభకు హాజరైన వారు ప్రతి ఇంటికీ వెళ్లి గర్వంగా వివరించాలని పిలుపునిచ్చారు. 

ఈ బీసీ డిక్లరేషన్ ఏమీ ఆషామాషీగా తీసుకురాలేదని అన్నారు. గత మూడేళ్లుగా 153 కులాలను 56 సాధికార కమిటీలుగా విభజించి, అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టామని వెల్లడించారు. నాయకులతో, ప్రజాసంఘాలతో మాట్లాడామని, లోకేశ్ పాదయాత్రలో గమనించిన అంశాలను కూడా అధ్యయనం చేశామని చెప్పారు. 

"జనసేన, టీడీపీ నేతలు కూర్చుని, ఒక బ్రహ్మాండమైనటువంటి, చరిత్రను తిరగరాసే బీసీ డిక్లరేషన్ ను ఇవాళ మీ ముందుకు తీసుకువచ్చాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ముందుకుపోతున్నాం. ఇవాళ పవన్ కల్యాణ్ కూడా మనతో కలిసి వచ్చారు. 

40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం. మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ డీఎన్ఏలోనే తెలుగుదేశం ఉంది. మీరు ఆ రుణం తీర్చుకోవాలి. మీకోసం పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చాం. ఈ ప్రభుత్వం పెన్షన్ ను దశలవారీగా పెంచింది... అదే 2019లో టీడీపీ వచ్చి ఉంటే అప్పుడే పెన్షన్ పెంచి ఉండేది. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే పెన్షన్ ను రూ.4 వేలు చేసే బాధ్యత తీసుకుంటాం. 

నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు. అనునిత్యం తయారుచేస్తే తప్ప సాధ్యం కాదు. ఒక్కోసారి చాలామంది వెనుకబడి ఉంటారు... అందుకు కారణాలు విశ్లేషిస్తే... ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటుతనమేనని అర్థమవుతుంది. ఇలాంటి కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది. 

అందుకే మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసి రాజకీయ నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ కార్యాచరణ తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు. అంతేకాదు, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు మేం పోరాడుతాం. 

బీసీల్లో 153 కులాలు ఉన్నాయి... అన్ని కులాలకు మేం స్థానాలు ఇవ్వలేకపోవచ్చు. టీడీపీ గానీ, జనసేన గానీ ఈ విషయంలో వీలైనంత వరకు అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ ఎవరికైనా మేం రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, వారికి స్థానాలు కేటాయించలేకపోతే... అలాంటివారిని నామినేటెడ్ పోస్టుల్లో తీసుకుంటాం. ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటాం. 

ఒకప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జనాభానే మన ఆస్తి. ఈ సందర్భంగా నేను, పవన్ కల్యాణ్ కలిసి హామీ ఇస్తున్నాం... ఎంతమంది పిల్లలు ఉన్నా ఫర్వాలేదు... స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కల్పిస్తాం. పాత చట్టాన్ని రద్దు చేస్తాం. చట్టబద్ధంగా కులగణన చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి. వారి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి. వారి సామాజిక రాజకీయ స్థితిగతులను కూడా అధ్యయనం చేసి అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తాం. 

జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం, సమాజంలో అందరినీ పైకి తీసుకువచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించడం మా ప్రాధాన్యతాంశాలు.

ముఖ్యమైన అంశం ఏమిటంటే... బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. 300 మంది బీసీలను చంపారు. కొన్ని వేల మందిపై తప్పుడు కేసులు పెట్టారు. రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణచివేసే ధోరణికి ఈ చట్టంతో అడ్డుకట్ట వేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు చట్టం ద్వారా ఎలా రక్షణ ఉందో, నా బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్త అని ఈ చట్టం ద్వారా ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. 

బీసీలు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు పెట్టాలన్నా ప్రోత్సహిస్తాం... ఐదేళ్లలో కనీసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. గతంలో మేం తీసుకువచ్చిన అన్ని విద్యా పథకాలను పునరుద్ధరిస్తాం. చంద్రన్న బీమా మళ్లీ తెస్తున్నాం. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులే కాకుండా ఇంటికి రూ.5 లక్షలు పంపించాం. మళ్లీ నా బీసీల కోసం చంద్రన్న బీమా పథకం కింద రూ.10 లక్షలు ఇస్తాం. పెళ్లి కానుక మళ్లీ ప్రారంభిస్తాం. ఎవరు పెళ్లి చేసుకున్నా రూ.1 లక్ష ఇచ్చే బాధ్యతను టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం. 

వడ్డెరల గురించి పవన్ గారు చాలా వివరణాత్మకంగా చెప్పారు. ఆయనతో నేను ఏకీభవిస్తున్నా. వడ్డెరలు రాళ్లు కొట్టుకునేదే వృత్తిగా పెట్టుకుని, కొందరు అందులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి  వాళ్లకు ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారు. వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని సాగిస్తున్న పోరాటానికి మేం మద్దతుగా ఉంటాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఎక్కువ కులాలను ప్రస్తావించలేకపోవచ్చు. 

మత్స్యకారులకు నష్టం కలిగించే జీవో నెం.217 రద్దు చేస్తాం. చేనేతలకు జీఎస్టీ తొలగిస్తాం. కుమ్మరి, మేదర, గీత కార్మికులు, వాల్మీకి బోయ, ఎంబీసీ, దాసరి, బొందిలి, తూర్పు కాపు, గాండ్ల, సగర, జంగం... ఇలా కొన్ని కులాలే కాకుండా మొత్తం 153 కులాలు ఉన్నాయి. అన్నింటికి న్యాయం చేస్తాం. ప్రతి కులానికి నిధులు కేటాయించడమే కాకుండా, ఆర్థికంగా పైకి తీసుకువస్తాం. 

ఇవాళ గుమ్మనూరు జయరాం మంత్రిగా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు. ఆయనను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయమన్నారు. కారణం చెప్పమన్నాడు. కారణం చెప్పలేదు. దాంతో, నీ ఎంపీ స్థానం వద్దంటూ వచ్చేసిన వ్యక్తి గుమ్మనూరు జయరాం. ఇప్పుడు నేను అడుగుతున్నా... ఆయన తప్పులు చేసి ఉంటే కాదన్నారు సరే... మరి మీ పెద్దిరెడ్డి సంగతేంటి? 

గనులు, లిక్కర్... ఇలా ఒకటి కాదు, ఏది దొరికితే అది... రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నాడు. పెద్దిరెడ్డిని మార్చే దమ్ముందా మీకు? వెనుకబడిన వర్గాలను ఊచకోత కోసిన పల్నాడు నేతలను మార్చే శక్తి మీకు ఉందా? 18 మంది బీసీ నేతలను చంపారు. తిరుపతిలో ఇంకొకాయన ఉన్నాడు... పెద్దఎత్తున ఎర్రచందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్ గా ఉన్న వ్యక్తిని ఒంగోలుకు తీసుకువచ్చాడు. అతడే... వీరప్పన్ తరహాలో భాస్కరన్ గా తయారయ్యాడు. 

2014లో పవన్ కల్యాణ్ గారు ఒకటే  చెప్పారు... విభజన జరిగింది... చాలా ఇబ్బందులు ఉన్నాయి... నేను పోటీ చేస్తే ఓటు చీలుతుంది... అందుకే పోటీ చేయను అని బేషరతుగా చెప్పారు. అప్పటినుంచి అనేక సమయాల్లో పవన్ సంఘీభావం తెలిపారు. మొదటిది యువగళం ముగింపు సభ, రెండోది తాడేపల్లిగూడెం సభ, మూడోది ఇవాళ్టి జయహో బీసీ సభకు వచ్చారు. ఈ మూడు మీటింగులు చూసి వైసీపీ గిజగిజలాడుతోంది. ఇంకో రెండు మూడు మీటింగులు పెడితే మీకు డిపాజిట్లు కూడా గల్లంతు అని హెచ్చరిస్తున్నా. 

మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ మీటింగ్ పెట్టాం కాబట్టి.. ఇక్కడ ప్రజలకు ఇళ్ల పట్టాలు  ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. 20 వేల ఇల్లు టిడ్కోకింద  నిర్మాణం చేయాలని కోరారు... తప్పకుండా పూర్తిచేస్తాం. టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్ శాల ఏర్పాటు చేసి చేనేత  కార్మికుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నారు. మేం కూడా చేయూతనిస్తాం. 

స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ అడిగారు. తప్పకుండా తీసుకువస్తాం. తాడేపల్లి పరిధిలో యూ1 జోన్ తీసుకువచ్చాం. నాడు ఈ జోన్ లో ఆస్తులు అమ్మరాదని ఆంక్షలు విధించాం. ఇప్పుడీ విషయం నా దృష్టికి వచ్చింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే యూ1 జోన్ ఎత్తివేస్తాం. తద్వారా భూములు అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తాం. 

మా పోరాటం మీ కోసం... మా యుద్ధం మీకోసం, భావితరాల కోసం, పుట్టబోయే పిల్లల కోసం. ఈ రెండు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం. ఇప్పటికే అనేక సందర్భాల్లో మా కమిట్ మెంట్ చూశారు. సూపర్ సిక్స్ కింద 6 పథకాలు ప్రకటించాం. 

ఇవాళ బీసీ డిక్లరేషన్ తో ముందుకొచ్చాం. అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాల్లో ఆదుకోవడానికి, వారికి సముచిత గౌరవం లభించేలా ఐదేళ్ల పాలనలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తాం. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి కృషి చేస్తాం... అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ  చంద్రబాబు పిలుపునిచ్చారు.

More Telugu News