Revanth Reddy: నాకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేస్తున్నారు... ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి సీఎంను అయ్యా: రేవంత్ రెడ్డి

Revanth Reddy counter to brs leaders who are talking about his english
  • తాను గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదని చురక 
  • ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ సాధనలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులది కీలక పాత్ర అన్న ముఖ్యమంత్రి
తనకు ఇంగ్లిష్ రాదని కొంతమంది అవహేళన చేస్తున్నారని... కానీ తాను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి... ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలను అందించిందన్నారు. రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడింది ఈ ఎల్బీ స్టేడియంలోనే అన్నారు.

తెలంగాణ సాధనలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులది కీలక పాత్ర అన్నారు. విద్యార్థులు, యువత త్యాగాలు, బలిదానాలతో తెలంగాణ సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని యువత భావించిందని, కానీ గత పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కుటుంబం... యువత ఆకాంక్షలు నీరుగార్చిందన్నారు.

తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పోరేట్ స్కూళ్లలో చదవలేదని చురక అంటించారు. గత ప్రభుత్వం వేలాది గురుకులాలు నిర్మించామని గొప్పగా చెప్పుకుందని... కానీ ఒక్క శాశ్వత భవనం లేదని విమర్శించారు. వసతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారు చేపలు, గొర్రెలు, బర్రెలు మాత్రమే పెంచాలన్నట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. రేషనలైజేషన్ పేరిట కేసీఆర్ ఆరు వేల పాఠశాలలను మూసివేశారని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్‌లో ఒక యూనివర్సిటీ మోడల్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Revanth Reddy
Congress
BRS

More Telugu News