Komatireddy Venkat Reddy: ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకుంటే హరీశ్ రావు బీజేపీలోకి వెళతారు: మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకేనని ఎద్దేవా
  • మేం తెచ్చిన జీరో బిల్లులా కేటీఆర్ నాలెడ్జ్ జీరో అని చురక
  • ఇక నుంచి యాదాద్రి కాదు... యాదగిరిగుట్ట అన్న మంత్రి కోమటిరెడ్డి
  • రాహుల్ గాంధీని నల్గొండ నుంచి పోటీ చేయమని కోరినట్లు వెల్లడి
  • ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీకే అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా
Minister Komatireddy interesting comments on Harish Rao

ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీశ్ రావు బీజేపీలోకి వెళతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకేనని ఎద్దేవా చేశారు. తాను కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తాము ప్రజల కోసం ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా జీరో బిల్లు ఇచ్చామని, అలాగే కేటీఆర్‌కు నాలెడ్జ్ జీరో అని చురక అంటించారు. ఏమాత్రం నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడుకోవడం వృథా అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ పర్యటనకు ఎందుకు వెళ్లలేదు? అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై నెగిటివ్ నివేదిక ఇచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని చెప్పారని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటవ తేదీనే వేతనాలు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇక నుంచి యాదాద్రి కాదని... యాదగిరిగుట్టనే అని కోమటిరెడ్డి స్పష్టం చేసారు. త్వరలో యాదగిరిగుట్టగా మారుస్తూ జీవో తెస్తామన్నారు. కేసీఆర్‌ను ప్రజలే నామరూపాలు లేకుండా చేశారని విమర్శించారు.

మోదీ కంటే రాహుల్ గాంధీకి ఎక్కువ మెజార్టీ వస్తుంది

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం తమ పార్టీలో అంతర్గతంగా సర్వే జరుగుతోందని కోమటిరెడ్డి తెలిపారు. భువనగిరి నుంచి పోటీ చేయమని తాము రాహుల్ గాంధీని కోరామని తెలిపారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తే దక్షిణాదిలోనే అత్యధిక మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజార్టీ సాధిస్తారని జోస్యం చెప్పారు.

More Telugu News