YS Sharmila: మోదీ పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పారు: తిరుపతి సభలో షర్మిల

  • తిరుపతిలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభ
  • హాజరైన షర్మిల, సచిన్ పైలెట్, సీపీఐ నారాయణ, సీపీఎం శ్రీనివాసరావు
  • ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసిన షర్మిల
Sharmila fires on PM Modi over special status issue

తిరుపతిలో ఇవాళ కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా మోహన్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ వర్గాలు సభను ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభగా అభివర్ణించాయి. ఈ సభను ఎస్వీ తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేశారు. 

ఈ సభలో షర్మిల ప్రసంగిస్తూ... 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోని ఇదే మైదానానికి వచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు తిరుపతి ప్రజల సాక్షిగా మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు. 

"రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర ప్రజల మెప్పు కోసం పదేళ్లు ప్రత్యేక హోదా అని అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోదీ ఇదే మైదానంలో వాగ్దానం చేశాడు. ఆనాటి సభలో మోదీ ఎన్ని మాటలు చెప్పాడు. ఆంధ్ర ప్రజల బాధ నాకు అర్థమవుతోందని అన్నాడు, ఆంధ్ర ప్రజల వేదన నాకు అర్థమవుతోందని అన్నాడు. మీకు భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను అన్నాడు, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు, దేశంలోని ఇతర నగరాలకు దీటైన రాజధాని నిర్మిస్తామని అన్నాడు. పెట్రో వర్సిటీ అన్నాడు... ఒక్కటైనా నెరవేరిందా? 

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల హక్కు. పునర్ విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశం ఏపీ ప్రజల హక్కు. అద్భుతమైన రాజధాని నిర్మాణం, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇన్ని హక్కులు మనం కలిగి ఉన్నప్పటికీ, ఒక్కటైనా మనకు లభిస్తుందా అనేది ప్రజలు ఆలోచించాలి. 

గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పటి జగనన్న ప్రభుత్వం ఒక్క హక్కునైనా సాధించారా? ఈ పదేళ్లలో ఒక్కటైనా సాధించుకున్నామా? అటు అధికార పక్షం, ఇటు విపక్షం రెండు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యాయి. 

రామభక్తుడ్ని అని చెప్పుకునే మోదీ మూడు నామాల వానికి పంగనామాలు పెట్టాడు. పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పాడు . మీరు ఎంతగానో నమ్ముతారని చెప్పే దేవుడ్ని కూడా మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మోదీని కేడీ అనక ఇంకేమనాలి? పదేళ్లు ప్రత్యేక హోదా అని చెప్పి, పదేళ్లయినా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్నందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది?" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

More Telugu News