KTR: జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?: కేటీఆర్ ఆగ్రహం... జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

  • చలో మేడిగడ్డ సందర్భంగా పరకాలలో కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్
  • తమ పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు
  • కార్యకర్తలు అధైర్యపడవద్దని... ఉద్యమంలో ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్న కేటీఆర్
KTR complaint sp against parakal police

జై తెలంగాణ అన్నందుకు తమ పార్టీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ అంబర్షాతో ఫోన్లో మాట్లాడారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఈ రోజు 'చలో మేడిగడ్డ' పేరుతో మేడిగడ్డకు వెళుతున్న సమయంలో ఇటీవల పోలీసుల చేతిలో గాయపడిన కార్యకర్తలను మార్గమధ్యంలో పరకాలలో పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ఉద్యమంలో ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూశామని ధైర్యం చెప్పారు.

పోలీసుల తీరు మారడం లేదని ఫిర్యాదు

స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినప్పటికీ పార్టీ కార్యకర్తలపై పోలీసుల తీరు మారడం లేదని పరకాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు... కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఢిల్లీ వరకు వెళతామని, న్యాయస్థానాలతో పాటు మానవహక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఎస్సై సస్పెండ్ అయినప్పటికీ ఏసీపీని, పోలీసులను కూడా వదిలేది లేదన్నారు. పరకాల వంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కావొద్దన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

More Telugu News