Scarlet fever: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. అది స్కార్లెట్ జ్వరం కావొచ్చు!

  • హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తున్న వ్యాధి
  • చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
  • లక్షణాలు పూర్తిగా తగ్గే వరకు స్కూలుకి పంపొద్దంటూ ప్రైవేటు స్కూళ్ల మెసేజ్‌లు
Hyderabad Children Suffers From Scarlet Fever

హైదరాబాద్ చిన్నారులను ఇప్పుడు స్కార్లెట్ జ్వరం వేధిస్తోంది. రోజురోజుకు దీని బారినపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులన్నీ పిల్లలతో నిండిపోతున్నాయి. జ్వరంతో వస్తున్న ప్రతి 20 మంది చిన్నారుల్లో 12 మందిలో స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఈ వ్యాధి కనిపించినప్పటికీ ఇప్పుడు దీని తీవ్రత మరింతగా పెరిగింది. 

ఇది సాధారణ జ్వరమనో, లేదంటే వైరల్ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమై, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. స్కార్లెట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారులు దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇతరులకూ సోకుతుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని, తగ్గే వరకు స్కూలుకు పంపొద్దని పేర్కొన్నాయి.

స్కార్లెట్ జ్వరం లక్షణాలు ఇవే
102 డిగ్రీలతో కూడిన జ్వరం, అకస్మాత్తుగా గొంతునొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు, నాలుక రంగు స్ట్రాబెర్రీ కలర్‌లోకి మారడం, గొంతు, నాలుకపై తెల్లని పూత, ట్రాన్సిల్ ఎరుపు రంగులో పెద్దగా కనిపించడం వంటివాటిని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

More Telugu News