Team India: ఇంగ్లండ్ తో చివరి టెస్టుకు టీమిండియా ఎంపిక

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • మార్చి 7 నుంచి ధర్మశాలలో చివరి టెస్టు
  • జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా
  • ఇంకా ఫిట్ నెస్ అందుకోని కేఎల్ రాహుల్
BCCI announces Team India squad for final test wiyh England

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో చివరి మ్యాచ్ మార్చి 7న ధర్మశాలలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఆడే టీమిండియాను సీనియర్ సెలెక్షన్ కమిటీ నేడు ప్రకటించింది. సిరీస్ లో తొలి టెస్టు అనంతరం ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ ను ఈ మ్యాచ్ కు కూడా ఎంపిక చేయలేదు. 

నాలుగో టెస్టు సందర్భంగా బుమ్రాకు విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు... చివరి టెస్టుకు అతడ్ని జట్టులోకి ఎంపిక చేశారు. ఇక, యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను టీమిండియా నుంచి విడుదల చేశారు. తమిళనాడు జట్టు రంజీల్లో ముంబయితో మార్చి 2 నుంచి సెమీఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున... వాషింగ్టన్ సుందర్ తమిళనాడు జట్టుతో కలవనున్నాడు. ఒకవేళ టీమిండియా కోరుకుంటే వాషింగ్టన్ సుందర్ ఐదో టెస్టు నాటికి జట్టులోకి వస్తాడని సెలెక్టర్లు వివరించారు. 

ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, ఆకాశ్ దీప్. 

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా ఇప్పటికే 3-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా... ఆ తర్వాత వరుసగా విశాఖపట్నం, రాజ్ కోట్, రాంచీలో జరిగిన మ్యాచ్ ల్లో జయభేరి మోగించింది.

More Telugu News